Rangula Raatnam movie Talkఈ సంక్రాంతి పండగకు చివరి నిముషంలో రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆశ్చర్యపరిచిన “రంగుల రాట్నం” కూడా విడుదలైంది. రెండు పెద్ద సినిమాల తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా అయినా సినీ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచిందా? అంటే మరోసారి నిరాశే ఎదురుకానుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అవును… ఈ సంక్రాంతికి విడుదలైన మూడో సినిమాకు సినీ అభిమానుల నుండి డివైడ్ టాక్ రావడం ఊహించని విషయం.

నిజానికి రెండు పెద్ద సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో, ‘రంగులరాట్నం’కు ప్రేక్షకులు ఎలాగైనా ఓటు వేస్తారని భావించారు. అయితే అలాంటి అవకాశాన్ని ఈ సినిమా ఇవ్వకపోవడం విశేషం. ఈ ఏడాది పండగకు విడుదలైన తొలి సినిమా ‘అజ్ఞాతవాసి’ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువగా, ‘రంగుల రాట్నం’ చిన్న బడ్జెట్ తో తెరకెక్కించడంతో భారీ నష్టాలు ఉండకపోవచ్చు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో “జై సింహా”కు ప్రేక్షకులు ఓటు వేయడంతో సేఫ్ ప్రాజెక్ట్ గా మారుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ప్రేక్షకుల పరంగా చెప్పాలంటే…. మూడు సినిమాలలో ఒక్కటి కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. ప్రతి సంక్రాంతి మూడు, నాలుగు సినిమాలు విడుదల కావడం, అందులో కనీసం ఒక్కటైనా ప్రేక్షకులను రంజింపచేయడం అనేది పండగ ఆనవాయితీ. కానీ, 2018వ సంవత్సరం మాత్రం అందుకు విరుద్ధంగా సాగడం సినీ అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. నిజానికి పండగకు రావాల్సిన సినిమాలన్నీ రిపబ్లిక్ డేకు వాయిదా పడడంతో, అసలు పండగ నెలాఖరులో ప్రారంభం కానుంది.