rangasthalam-sukumarస్టైల్ గా సూటు, బూటు వేసుకుని సగటు సినీ ప్రేక్షకుడి మేధస్సుకు అందని లాజిక్స్ తో పక్కా ‘ఎ’ క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయ్యే విధంగా తన సినిమాలను తీర్చిదిద్దడంలో సుకుమార్ స్పెషలిస్ట్. ఇందుకు నిదర్శనాలే “1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో” సినిమాలు. హీరోతో పాటు విలన్స్ ను కూడా బాగా స్టైలిష్ గా చూపించడం, విలన్స్ కు కూడా హీరోతో పాటు మేధస్సును అందించడం అనేది ఈ ‘లెక్కల మాస్టార్’ స్క్రిప్ట్ లలో ఉండే ప్రధాన అంశం. ఇక కధనంలో సుకుమార్ ఇచ్చే ట్విస్ట్ లకు ‘ఔరా’ అనడం సినీ ప్రేక్షకుల వంతు!

కానీ ఇవేమీ తాజా “రంగస్థలం”లో కనిపించవు. ఇంకా చెప్పాలంటే… ఇప్పటివరకు చూసిన రామ్ చరణ్ ఒకెత్తు… ‘రంగస్థలం’లో రామ్ చరణ్ మరో ఎత్తు అని ఎలా బల్లగుద్ది చెప్పగలమో, అలాగే ఇప్పటివరకు సుకుమార్ తీసిన సినిమాలు ఒకెత్తు… ఈ ‘రంగస్థలం’ మరో ఎత్తుగా అభివర్ణించవచ్చు. సుకుమార్ నుండి ఇలా ఫక్తు కమర్షియల్ మాస్ మసాలా సినిమా వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎలాంటి ట్విస్ట్ లకు, ప్రేక్షకుల మైండ్ కు పని చెప్పే సీన్లకు దూరంగా… సగటు సినీ ప్రేక్షకుడికి అర్ధమయ్యే విధంగా ‘రంగస్థలం’ సినిమాను అద్భుతంగా ప్రజెంట్ చేసాడు సుక్కూ.

స్టైలిష్ చిత్రాలను ఎంత అద్భుతంగా వెండితెరపై చూపించారో, అంతే అద్భుతంగా ఈ ఊర మాస్ ‘రంగస్థలం’ను ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా సుకుమార్ కెరీర్ మరో మెట్టు ఎదగడం ఖాయం అని బల్లగుద్ది చెప్పవచ్చు. కమర్షియల్ గా ఎన్ని రికార్డులను ‘రంగస్థలం’ సాధిస్తుంది అన్నది మరో రెండు, మూడు రోజులు గడిస్తే చెప్పలేం గానీ, ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ నుండి, హీరోయిన్ సమంత, రంగమ్మత్తగా అనసూయ, ఆది పినిశెట్టి, ఫణీంద్ర భూపతిగా జగపతిబాబు, నరేష్… ఇలా ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించేలా స్క్రిప్ట్ ను తీర్చిదిద్దడం… ఒక డైరెక్టర్ గా సుకుమార్ లోని పరిపక్వతను సూచిస్తుంది.