Rangasthalam---Don't-Come-with-Expectations---Sukumarదర్శకుడిగా సుకుమార్ కెరీర్ ను మార్చేసిన సినిమా ‘1 నేనొక్కడినే.’ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించనప్పటికీ, దర్శకుడిగా సుకుమార్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఫెయిల్ అయిన ఈ సినిమాకు అభిమానుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ‘రంగస్థలం’ హుషారులో ఉన్న సుక్కూ, ఈ సినిమా ఫెయిల్యూర్ కు సంబంధించిన అంశంపై తాజాగా వివరణ ఇచ్చారు.

‘రంగస్థలం’ థాంక్యూ మీట్ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…. ప్రేక్షకులు ఎదగలేదు చూసేందుకు అన్న డైలాగ్ ను తానూ ‘1’ సినిమా సందర్భంలో వాడలేదని, ‘జగడం’ సినిమాకు సంబంధించి ఏం మారుస్తారు అంటే? ఆడియన్స్ ను మారుస్తానని చెప్పానని, అప్పుడు తనలో మెచ్యూరిటీ లేదని, కోపంలో అలా చెప్పేసానని, ‘1’ సినిమాలో తన తప్పులు తెలుసుకున్నానని, ఆడియన్స్ ను నిందించలేదని అన్నారు.

నిజానికి అలా తప్పులు తెలుసుకున్నాను కాబట్టే… ఈనాడు ‘రంగస్థలం’ ఇలా తీయగలిగానేమో… అంటూ సుక్కూ ఇచ్చిన బదులుకు స్టేజ్ పైన ఉన్న వారంతా చప్పట్లతో అభివాదించారు. ‘రంగస్థలం’ చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే అనుభూతి కలిగి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా “1 నేనొక్కడినే” సినిమా అనుభూతులను సుకుమార్ అంత తేలికగా అయితే మరిచిపోయినట్లు లేరు.