Rangasthalam 1985 Ram Charanమెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నాటకాలాడుతున్నారట. దీని వెనుక మరొక వ్యక్తి దగ్గరుండి మరీ చెర్రీ చేత నాటకాలు ఆడించేలా చేస్తున్నారట. అవును… ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ హాట్ గా హల్చల్ చేస్తోన్న అంశం ఇది. అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి… రీల్ లైఫ్ లో చెర్రీ నాటకాలు ఆడబోతున్నాడట… దర్శకుడు సుకుమార్ ఈ నాటకాలను కన్నులవిందుగా ఆడిస్తున్నారని ట్రేడ్ టాక్.

అందులో భాగంగానే సుకుమార్ – రామ్ చరణ్ ల సినిమాకు “రంగస్థలం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల భోగట్టా. ఇటీవలే రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న షెడ్యూల్ లో రంగస్థలంపై రామ్ చరణ్ బృందం ఆడిన పలు నాటక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సమాచారం. మరి రంగస్థల కళాకారుడిగా చెర్రీ అభినయం ఎలా ఉంటుందో తెలియాలంటే 2018 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి రెండు సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ, ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్ లుక్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో రాగా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న షూటింగ్ పిక్స్ పట్ల కూడా సినీ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఖచ్చితంగా ఓ డిఫరెంట్ సినిమాగా “రంగస్థలం” ఎప్పటికి నిలిచిపోతుందన్న ధీమాతో ఉన్నారు.