ranganath died in chennaiప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే. సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయం రంగనాథ్ వద్ద ఎప్పుడూ ఉంటుందని సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్తుంటారు. అలాగే సమాజాన్ని మేలుకొలిపే విధంగా పలు కవిత్వాలు కూడా రచిస్తుంటారు రంగనాథ్. అలా ఆయన కలం నుండి జాలువారిన చివరి కవిత్వం “ఎవరు దేవుడు…?” ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఎవరు దేవుడు..?

అదేదో ఊరి నుండి పెద్ద శిల్పి వచ్చాడు
మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు
ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలసింది
మూడడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది
కంపుకంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి
కంపుకొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి
గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి
మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి
అర్ధం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు
చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్ధాలు
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది
పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది
కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి
రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి
గుడిలోని దేవుడా… రేవులోని బండ…?
ఎవరు దేవుడు..?

ఎంతో ఆర్ధమున్న ఈ కవిత ప్రస్తుతం ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటోంది. రంగనాథ్ మన మధ్య లేకపోయినా… ఆయన రాసిన అక్షరాలు ఆయన రూపంలో దర్శనమిస్తూ… రంగనాథ్ ఉదార స్వభావాన్ని, ఆలోచన తీరును చాటి చెప్తున్నాయి.