Krishna Vamsiనువ్వు ఏంటనేది గతాన్ని బట్టి కాక వర్తమానాన్ని బట్టి కొలిచే జనరేషన్ లో ఉన్నాం మనం. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఇక్కడ మనిషిని నిర్దేశించేది సక్సెస్ మాత్రమే. అందుకే ముఖేష్ అంబానీకున్నంత తెలివి, పాపులారిటీ తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉన్న అనిల్ అంబానీకి లేకపోయింది. దానివల్ల నష్టపోయింది ఎవరో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి బి గోపాల్ లాంటి దర్శకులు తీయగలిగే సత్తా ఉన్నా ఎందుకు డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారంటే వీళ్ళ గత సినిమాల ఫెయిల్యూర్స్ వల్లే. అందుకే నిర్మాతలు సాహసం చేయడం లేదు.

కానీ కృష్ణవంశీ కథ వేరు. పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రంగమార్తాండ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో బ్రహ్మానందం రమ్యకృష్ణ అనసూయ లాంటి మంచి క్యాస్టింగ్ ఉంది. సుప్రసిద్ధ ఇళయరాజా సంగీతం సమకూర్చారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బ్రతికున్నప్పుడే కొన్ని పాటలు రాయించేసుకున్నారు. మరి ఇన్ని విశిష్టతలు ఉన్నా విడుదలకు మాత్రం ఆపసోపాలు పడుతోంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

నిజానికి దాన్ని ఎంచుకున్నప్పుడే ఇండస్ట్రీలోనే బోలెడు గుసగుసలు. ఎందకంటే రంగమార్తాండలో ఎంత బలమైన కథ ఉన్నా అది ఇప్పటి తెలుగు థియేటర్ ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండదు. మరి దానికి తగ్గట్టు ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమో తెలియదు. ఏళ్ళ తరబడి అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఖచ్చితంగా ఏ డేట్ కి రిలీజ్ అవుతుందో కృష్ణవంశీనే చెప్పలేని పరిస్థితి. బయ్యర్లకెమో అంతగా ఆసక్తి లేదు. ఓ రంగస్థల నటుడి జీవితాన్ని తెరమీద చూడటం మీద ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయి. చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినంత మాత్రాన ఓపెనింగ్స్ రావుగా.

కృష్ణవంశీకి ఇది ఖచ్చితంగా ఋజువు చేసుకోవాల్సిన సమయం. గతంలో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడే చేసినప్పుడు రొటీన్ ఓవర్ డ్రామా సెంటిమెంట్ తో తనకొచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వృధా చేసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ నక్షత్రం కోసం సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు క్యామియో చేసినా దాన్ని మంచి సినిమాగా మలుచుకోలేకపోయారు. ఇప్పటికీ మొగుడులో శృతి మించిన మెలోడ్రామా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని చేసుకోవాల్సిన మార్పులు. రంగమార్తాండ వచ్చాకైనా ఏదైనా మేజిక్ జరిగేందేమో చూద్దామంటే అసలంటూ వస్తేగా.