Tu Jhoothi Main Makkaarసౌత్ సినిమా డామినేషన్ ని తట్టుకోవడం బాలీవుడ్ కు అంత సులభంగా లేదు. పఠాన్ వెయ్యి కోట్లు దాటేసిందని సంబరపడినా ఆ మార్కు చేరుకోవడం కోసం రెండు వారాల తర్వాత ఎన్నెన్ని స్కీంలు ఆఫర్లు పెట్టి జనాన్ని థియేటర్లకు రప్పించారో తెలిసిందే. ఆలాని పఠాన్ బాలేదని కాదు. మంచి యాక్షన్ థ్రిల్లరే. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఫామ్ లో ఉన్నప్పుడు కనక వచ్చి ఉంటే ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చేది కాదన్న మాట వాస్తవం. సరే ఏదైతేనేం మొత్తానికి బాహుబలి 2ని దాటించిన సంతృప్తి దక్కింది. దాంతో ఉత్తరాది జనాల ఆనందం మాములుగా లేదు.

ఈ ఊపులో అన్నీ బాగా ఆడతాయనే అంచనాతో ఎదురు చూస్తున్న అక్కడి నిర్మాతలకు వరస షాకులు తగులుతున్నాయి. షెహజాదా అడ్డంగా తన్నేసింది. సెల్ఫీ అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ మూటగట్టుకుంది. దెబ్బకు నార్త్ ట్రేడ్ మళ్ళీ క్రాస్ రోడ్స్ కు వచ్చినట్లయ్యింది. ఇప్పుడు తూ ఝూటి మై మక్కర్ వచ్చింది. ప్రీమియర్లతో మొదలుపెట్టి ఇదో క్లాసిక్ అని దిల్ తో పాగల్ హై తర్వాత ఆ స్థాయిలో లవ్ అండ్ రొమాన్స్ ని ఇందులో చూస్తున్నామని ముంబై క్రిటిక్స్ తెగ ఊగిపోయారు. ఏకంగా నాలుగు పైనే రేటింగ్ ఇచ్చారు.

తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఇంకోలా ఉంది. పఠాన్, దృశ్యం 2లకు జెన్యూన్ టాక్ వచ్చినప్పుడు రెండో రోజు నుంచే అర్ధరాత్రి తెల్లవారుఝామున షోలు పెంచారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1కు సైతం ఇదే జరిగింది. రన్బీర్ కపూర్ ని న్యూ జనరేషన్ సూపర్ స్టార్ గా పొగిడేశారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడీ ఝూటి మక్కర్ కు కూడా ఆ సీనే రిపీట్ కావాలి. ముంబై ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలు తప్పించి మిగిలిన చోట ఓ మోస్తరుగా ఆడియన్స్ రెస్పాన్స్ ఉందే తప్ప అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సోల్డ్ అవుట్ అయ్యేంత లేదు.

మరి ఇంతగా ఎందుకు మోస్తున్నారంటే కారణం ఒకటే. మళ్ళీ కిందపడకూడదు. ఒకవేళ పడినా పైచేయి అన్నట్టు నటించాలి. ఇప్పుడదే జరుగుతోంది. తూ ఝూటి మై మక్కర్ విషయంలో పైకి ఎంత బిల్డప్ ఇచ్చినా ఇదేమి బ్లాక్ బస్టర్ కాబోదు. పోటీ లేదు కాబట్టి మహా అయితే హిట్టు ముద్ర పడొచ్చు తప్పించి అంతకు మించి అద్భుతాలేం జరగవు. అజయ్ దేవగన్ భోళా మార్చి 30 వచ్చే దాకా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. వసూళ్ల ఫిగర్లను హైప్ చేసి చూపించుకుంటూ ఊదరగొట్టడం తప్ప అంతకన్నా చేసేదేమీ లేదు.