సాధారణంగా సినీ పరిశ్రమలో నెగిటివ్ విషయాలను బయటకు తెలవకుండా జాగ్రత్తపడుతుంటారు. పొరపాటున అలాంటివి తెలిసినా వాటిని దాచేసే ప్రయత్నం చేస్తుంటారు. షారూఖ్ ఖాన్, కంగనా రనౌత్ లు చైన్ స్మోకర్లని, అలాగే సల్మాన్ ఖాన్ డ్రింక్ చేస్తే విచక్షణ కోల్పోతాడని పలు సందర్భాల్లో అభిమానులకు అర్ధమయ్యేలా వార్తలు వచ్చినా… అబ్బెబ్బే… అలాంటిదేమీ లేదని, పార్టీల్లో సహజమని బాలీవుడ్ వర్గాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
అయితే వీటికి భిన్నంగా…. ‘తనకు తాగుడు పెద్ద సమస్యగా మారిందని’ యువ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ లో ‘ఖాన్’ త్రయం తర్వాత, ప్రస్తుత తరంలో ‘స్టార్’ హీరోల జాబితాలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరో రణబీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. “నేను తాగుతాను. బాగా తాగుతాను. ఇదే నాకు ప్రధాన సమస్యగా మారింది. అయితే షూటింగ్ సమయాల్లో మాత్రం తాగను… షూటింగ్ లేకపోతే మందేసుకుని కూర్చుంటాను” అంటూ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
“నా కుటుంబం, ప్రేయసి తదితర విషయాలను తలచుకుని మారాలని అనుకుంటాను. కానీ తాగుడుకు బానిస అయిపోయాను. ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ సమయంలో కత్రినాతో సాన్నిహిత్యం మొదలైందని, అప్పటి నుంచే మేము ప్రేమలో ఉన్నామని, కత్రినాపై ఎంత ప్రేముందో చెప్పడానికి మాటలు చాలవని” తన భావాలు బయటపెట్టాడు. అయితే, ఈ తాగుడు అలవాటు భరించలేకే కత్రినా వదిలేసినట్టుగా బాలీవుడ్ లో పలువురు గుసగుసలాడుకుంటున్నారు.