ఒక పెద్ద కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు తాము నటించిన కంటెంట్ ని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని చెప్పడం బహుశా రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలోనే జరిగింది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ కం రివెంజ్ డ్రామాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా జోడించారు. అయితే వాళ్ళను మాత్రం దూరం ఉండండని సున్నితమైన హెచ్చరిక చేయడం విచిత్రం. పది ఎపిసోడ్లతో ఏడు గంటలకు పైగా నిడివితో వచ్చిన రానా నాయుడు మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. థ్రిల్ ఇస్తుందని ఎదురు చూశారు
రే డొనోవాన్ అనే అమెరికన్ సిరీస్ దీనికి మూలం. కథ పరంగా చూసుకుంటే మంచి పాయింట్ ఉంది. పదిహేనేళ్ళు కుటుంబానికి దూరంగా జైల్లో శిక్ష అనుభవించిన తండ్రి నాగ నాయుడు(వెంకటేష్) తన నలుగురు కొడుకుల కోసం ముంబై వస్తాడు. వాళ్ళలో ఒకడి(రానా)కి నాగ అంటే విపరీతమైన కోపం అసహ్యం. ఎదురు పడితే చాలు చంపేయాలన్నంత కసితో ఉంటాడు. అసలు త్వరగా ఎందుకు రిలీజయ్యాడని బాధ పడుతుంటాడు. తన స్థితికి కారణమైన వాళ్ళను టార్గెట్ చేయడంతో పాటు అయినవాళ్లకు దగ్గరవ్వాలనే తపన నాగా నాయుడుది. స్థూలంగా ఇంత పెద్ద సబ్జెక్టులో మెయిన్ లైన్ ఇదే.
సగటు తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్, థ్రిల్ కి ఎంతో అవకాశమున్నా దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలు ఫక్తు నెట్ ఫ్లిక్స్ స్టైల్ లో బూతు జోకులు, హద్దులు మీరిన కొన్ని సెమీ న్యూడ్ (అర్థనగ్న) దృశ్యాలను సహజత్వం పేరుతో జొప్పించారు. హాలీవుడ్ సిరీస్ లో ఇవి సహజమే కానీ హోమ్లీ హీరోగా పేరున్న వెంకటేష్ ని ఇలాంటి పాత్రల మధ్య చూడటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏనాడూ డబుల్ మీనింగ్ జోలికి వెళ్లని వెంకీ ఇలా పచ్చి సంస్కృతం మాట్లాడుతుంటే కళ్ళు చెవులు అంగీకరించవు. సరే ట్రెండ్ ని ఫాలో అవుతున్నామని దగ్గుబాటి టీమ్ చెప్పొచ్చు. కానీ లెగసి అంటూ ఒకటుందిగా.
దాన్ని క్యారీ చేసే కొత్త తరం గతంలో పెద్దవాళ్ళు పాటించిన విలువలను కొనసాగించాలి. రానా నాయుడు చేయడానికి కేవలం డబ్బే కారణం కాకపోవచ్చు. అదే నిజమైతే రామానాయుడు గారు బ్రతికున్నపుడు ఎన్నో డబ్బింగ్ సినిమాలు కొనేవాళ్ళు. ఇంకెన్నో కోట్లు పోగేసేవాళ్ళు. కానీ తీయలేదు. వినేవాళ్ళు కన్విన్స్ అయ్యేలా సమర్ధింపులు ఏ కోణంలో అయినా చేసుకోవచ్చు.వాదిస్తూ పోతే దానికి అంతు ఉండదు. కానీ ఏ వెంకటేష్ మహిళా వీరాభిమానో యథాలాపంగా రానా నాయుడు మీదే ఓ లుక్కేసి ఇదెందుకు చేశారని అనుకోకూడదుగా. డెబ్భై అయిదు సినిమాల అనుభవం మీద మరక అది చిన్నదైనా సరే అవసరం లేనిదే. పడితే శుభ్రం చేయడానికి ఏ సర్ఫ్ పౌడరూ సరిపోదు