rana twitter question and answerట్విట్టర్‌లో భారీగా అభిమానులను సొంతం చేసుకున్న దగ్గుపాటి వారి వారసుడు యువనటుడు రానా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా అంద‌రినీ మెప్పించిన రానాకి ట్విట్ట‌ర్‌లో తాజాగా తెలుగులో ట్వీట్ చేయాల‌నిపించింది. అందుకే ‘తెలుగులో ట్వీట్‌ చేసే మొదటి ప్రయత్నం’ అని ట్విట్ట‌ర్ లో పేర్కొంటూ… ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై అభిమాన గణం భారీగా స్పందించింది. ఓ అభిమాని ‘హలో బ్రదర్‌..! ట్వీట్‌ అనే పదం కూడా తెలుగులో రాసుంటే బాగుండేది’ అని బదులిచ్చాడు. దానికి రానా రిప్లై ఇస్తూ… ‘ట్వీట్‌ అనేది English పదం కాబట్టి వదలేసాను’ అని పేర్కొన్నాడు. అనంత‌రం మ‌రో అభిమాని ట్వీట్ చేస్తూ ‘వ‌దిలేయ‌డానికి అది అవంతిక కాదు భళ్లాలదేవా.. అది దేవ‌సేన’ అంటూ పేర్కొన్నాడు.

అలాగే మ‌రో అభిమాని ట్వీట్ చేస్తూ ‘ఇంగ్లీష్ ప‌దం కాబ‌ట్టి వ‌దిలేశాను అని అనకూడ‌దు.. ఆంగ్ల ప‌దం కాబ‌ట్టి వ‌దిలేశాను అనాలి’ అని పేర్కొన్నాడు. మ‌రో అభిమాని ఏకంగా ట్వీట్‌ లోకి డిక్ష‌న‌రీనే తీసుకొచ్చి ‘ట్వీట్ అంటే అర్థం ప‌క్షి అరుపు, ప‌క్షివ‌లే అర‌చు’ అంటూ డిక్ష‌న‌రీలో ఉన్న ప‌దాలను వివ‌రించి చెప్పాడు. ఇలాంటి సరదా కామెంట్లకు నిలయంగా రానా తొలి తెలుగు ట్వీట్ నిలిచింది.