సోలో హీరోగా రానాకు అవకాశాలు తక్కువ, విజయాలు తక్కువే. 2017 తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సోలో హీరోగా తన కేరీర్ లోనే పెద్ద హిట్ అందుకున్నాడు రానా. అయితే ఆ తరువాత రానా సోలో హీరో తెలుగులో సినిమా చెయ్యలేదు. మొత్తానికి అభిమానులకు ఆ కొరత తీరబోతుంది. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నీది నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణు ఉడుగుల డైరెక్టర్ గా వస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. చాలా రోజులుగా ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం రేపు ముహూర్తం జరుపుకోబోతుంది.
టైటిల్‌కు తగ్గట్టుగానే 1992 నాటి గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ సినిమా రూపొందబోతున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం నుంచి 1992 దాకా గ్రామస్థాయి రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విభిన్న కథను తీసుకున్న వేణు ఉడుగుల ఈ స్క్రిప్టు పై పెద్ద గ్రౌండ్ వర్కే చేశారట. మార్క్సిజం భావాల ప్రభావితంతో నక్సలైట్‌గా మారిన అమ్మాయిగా కనిపించబోతోంది సాయి పల్లవి.
నక్సలైట్ ప్రభావిత గ్రామంలో రాజకీయాలు చేసే పంచాయితీ వార్డ్ మెంబర్‌గా రానా దగ్గుపాటి కనిపించబోతున్నాడు. రానా దగ్గుపాటి సొంత సంస్థ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ నటి ప్రియమణి మళ్ళీ నటించనుందని సమాచారం. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ విషయం మీద రేపు క్లారిటీ రావొచ్చు.