Rana Daggubabti Nen Raju Nene Mantri on Small Screenసిల్వర్ స్క్రీన్ పై ఆల్ టైం సూపర్ సక్సెస్ సాధించిన “బాహుబలి 2” ఈ ఆదివారం నాడు ‘స్మాల్ స్క్రీన్’పై ప్రసారం అయిన విషయం తెలిసిందే. వెండితెరపై ఎలా అయితే గత రికార్డులను నామరూపాలు లేకుండా చేసిందో, బుల్లితెరపై కూడా అదే విధ్వంసకరమైన రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీఆర్పీ రేటింగ్స్ పై పూర్తి సమాచారం తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉండగా, ఈ లోపునే ‘భళ్ళాలదేవుడు’ మరో రూపం ‘రాధాజోగేంద్ర’ స్మాల్ స్క్రీన్ ను టచ్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రానా, బుల్లితెరపై కూడా బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో తన విశ్వరూపం ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. ఈ నెల 15వ తేదీన అంటే వచ్చే ఆదివారం నాడు “నేనే రాజు నేనే మంత్రి” సినిమా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు తీసుకున్న ప్రముఖ ‘స్టార్ మా’ ఛానల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రోమోలు కూడా ప్రారంభించింది. ‘రాధా జోగేంద్ర’గా బుల్లితెరను ఏలడానికి సిద్ధమవుతున్న రానా, ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.