rana daggubati hiranyakashipuభారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపించే గుణశేఖర్.. వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి ఆసక్తిని కనబరిచే రానా కలయికలో ‘హిరణ్యకశ్యప’ పేరుతో పౌరాణిక చిత్రం రూపొందబోతుంది. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నామని, ఇప్పటిదాకా మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్కు మీద పని చేశామని గుణశేఖర్ అప్పట్లో ప్రకటించారు.

హిరణ్యకశ్యప వచ్చే ఏడాది వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే సెట్స్ నిర్మాణం కూడా మొదలు పెట్టేశారు. ప్రీ-ప్రొడక్షన్ పర్ఫెక్ట్ గా చెయ్యడంతో ఆరు నుండి ఎనిమిది నెలలోనే పూర్తి చెయ్యాలని గుణ అనుకుంటున్నాడు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలకు మాత్రం కొంత సమయం తీసుకుంటాడట.

‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్. టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో తొందరలో ప్రత్యేక కసరత్తులు మొదలు పెడతాడట రానా. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రముఖ వి.ఎఫ్.ఎక్స్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయట.

బాలలతో పౌరాణిక చిత్రం ‘రామాయణం’ తీసి మంచి విజయాన్నందుకున్న గుణశేఖర్ ఈ మైథలాజికల్ మూవీతోనూ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న గుణశేఖర్ ను రానా గట్టెక్కిస్తాడేమో చూడాలి.