Rana Daggubati - Baahubali 2 Promotions Kattappa Killed Baahubaliప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్నకు ‘భల్లాల దేవుడు’ ఓ తుంటరి జవాబు ఇచ్చారు. మీడియా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న రానాకు యధావిధిగా ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న ఎదురైంది. అయితే అందరిలా కాకుండా ఈ ప్రశ్నకు కాసింత ఎటకారాన్ని జోడిస్తూ… బాహుబలిని క‌ట్ట‌ప్ప‌ చీకట్లో చంపేశాడ‌ని, ఆ చీక‌ట్లో తన‌కు ఆ దృశ్యం స‌రిగా క‌నిపించ‌లేద‌ని, ఎందుకు చంపాడో తెలియ‌లేద‌ని చ‌మ‌త్క‌రించారు. అంత‌కంటే త‌న‌కింకేమీ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించాడు.

వెండితెర‌పై వెలుతురు ఉంటుంద‌ని అందులో చూడాల‌ని ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చాడు రానా. బాహుబ‌లి-2లో త‌న‌కు అనుష్క యాక్ష‌న్ బాగా న‌చ్చింద‌ని, ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చాడు. బాహుబ‌లి-1లో యుద్ధ సన్నివేశాల వంటి రిస్కీ యాక్షన్ దృశ్యాలు చేయడం మొదటి ప్రయత్నం కావ‌డంతో అవి చేయ‌డం కొంత కష్టమనిపించింద‌ని, అయితే, పార్ట్ 2లో మాత్రం చాలా సులువుగా అనిపించిందని, కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ ను జోడించడం ప్రతి రోజూ సవాలేన‌ని చెప్పాడు.

బాహుబ‌లి చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను ప్రోత్స‌హించేలా చేసింద‌ని, ఇప్పుడు నిర్మాతలు భారీ చిత్రాల‌ వైపుగా ఆలోచించడం అద్భుతమ‌ని అన్నారు. ఒక ప్రాంతీయ భాషా సినిమా “బాహుబ‌లి” ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని చెప్పాడు. బాహుబలి-1 అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని అన్నాడు. బాహుబలిలో నటించడం ద్వారా తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తులో పాత్రలను ఎంపిక చేసుకుంటానని చెప్పాడు.