Ramoji Rao Invites Chandrababu Naidu and KCR for a Lunch Meeting?తెలుగు రాజకీయాలలో రాజగురువుగా భావించే ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు కొత్త సమీకరణలకు తెర లేపారా? అంటే అవును అనే అంటున్నారు కొందరు మీడియా మిత్రులు. రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఒక ఫంక్షన్ కు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్హ్యమంత్రులను ఆయన పిలిచారని, ఆ కార్యక్రమం పూర్తి కాగానే ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారని వార్తలు వస్తున్నాయి. అమరావతిలో ఉన్న చంద్రబాబు ఒక స్పెషల్ హెలికాప్టర్ పై రామోజీ ఫిలిం సిటీకి కాసేపటి క్రితం బయలుదేరారు.

2014 ఎన్నికలు పూర్తయిన నాటి నుండీ కేసీఆర్, చంద్రబాబు ఉప్పునిప్పూ వాలే ఉన్నారు. మధ్యలో కొంత సఖ్యత కనబరిచినా ఓటుకు నోటు కేసు, ఆపరేషన్ ఆకర్ష తదనంతర పరిణామాలతో టీడీపీని తెలంగాణలో భూస్థాపితం చేశారు కేసీఆర్. అదను కోసం వేచి చూసిన చంద్రబాబు గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ తో జతకట్టి కేసీఆర్ ను ఓడించడానికి విఫల యత్నం చేశారు. దానిని సహించలేని కేసీఆర్ రిటర్న్ గిఫ్టు ఇస్తా అని బాహాటంగానే ప్రకటించారు.

ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పని చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరినీ ఒకతాటి మీదకు తెచ్చి కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో భాగస్వాములను చెయ్యాలని రామోజీ రావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. స్వతాహా కాంగ్రెస్ వ్యతిరేకి అనే ముద్ర కలిగిన రామోజీ రావు ఎన్డీయే వైపు ఉంటున్నారా? లేక మరేదైనా కొత్త ప్రయోగానికి సిద్ధం అవుతున్నారా అనేది వేచి చూడాలి. ఈ వార్త నిజమైతే మాత్రం ఇదొక సంచలనం అనే చెప్పుకోవాలి.