Ramana Deekshitulu sensational comment on chandrababu naiduఒకప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు ఇంకా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కోపం తగ్గినట్టు లేదు. బాబు ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది దాటినా ఇంకా టీటీడీలో జరిగే తప్పులకు రమణ దీక్షితులు చంద్రబాబునే నిందిస్తుండడం గమనార్హం.

స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందని.. మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కేసులు పెరుగుతున్నా ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందని.. తన ట్వీట్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

అక్కడితో ఆగితే పర్లేదు… ఇప్పటికీ తిరుమలలో బ్రాహ్మణ, ఆలయ వంశపారంపర్య అర్చక వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు విధానాలే ఉన్నాయని, టీటీడీపీ వారి పెత్తనం ఇంకా ఉందని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన వైఎస్ జగన్‌ను కోరారు.

రమణ దీక్షితులకు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో ఇబ్బంది ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది. అయితే సదరు సింఘాల్ కూడా చంద్రబాబు నియమించిన వ్యక్తి కాదు. అప్పట్లో బీజేపీ పొత్తు కారణంగా ఆయనను బీజేపీ సిఫార్సు చేసింది. అప్పట్లో ఆయన నియామకంపై వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద గొడవే చేసింది. అయితే ఇప్పుడు బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయనను జగన్ తొలగించలేదు. జగన్ ను అనలేక రమణ దీక్షితులు చంద్రబాబుని అంటున్నట్టుగా ఉంది.