ram-versus-tv5-nenu-sailaja-bad-review“నేను.. శైలజ…” సినిమా విడుదల నుండి ఇప్పటివరకు టీవీ 5 న్యూస్ ఛానల్ కు – సదరు చిత్ర యూనిట్ కు మధ్య మాటల పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా రివ్యూతో ప్రారంభమైన ప్రస్థానం తాజాగా సదరు మీడియా ఛానల్ పై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేసే వరకు దారితీసింది. గత ఏడాది కాలంగా టీవీ 5 న్యూస్ ఛానల్ లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే ఉద్యోగిని ఇటీవల యాజమాన్యం తొలగించిందని, దీంతో ఉపాధి కోల్పోయిన తన అభిమాని నవీన్ కు మరో ఉద్యోగం దొరికే వరకు తానూ జీతం ఇస్తానంటూ రామ్ చేసిన వ్యాఖ్యలు పలు సంచలనాలకు దారి తీసింది.

అయితే దీనికి బదులుగా సదరు మీడియా సంస్థ మరో జవాబిచ్చింది. “నవీన్ అనే ఉద్యోగిని తామూ తొలగించలేదని, చేసిన తప్పును ఒప్పుకుని స్వయంగా రాజీనామా సమర్పించాడని, ఒక మీడియా సంస్థ అప్ లోడ్ చేసిన వీడియోను తొలగించే అధికారం ఉద్యోగికి లేదని, కానీ ఎవరి అనుమతి తీసుకోకుండా ఇలా ప్రోగ్రామ్స్ మొత్తం డిలిట్ చేయడం నమ్మక ద్రోహమని, ఇలాంటి నమ్మక ద్రోహం చేసే వారికి రామ్ అండగా నిలబడ్డాడు. రామ్ అభిమానులందరూ ఇలా నమ్మక ద్రోహం చేసే వారేనా..! ఇదేనా నైతిక విలువ.. ఒకవేళ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులంటే హీరో రామ్ కి ఇష్టమా..!” అంటూ బదులిచ్చింది.

సదరు ఉద్యోగి నవీన్ కూడా అంతే స్థాయిలో ట్విట్టర్ వేదికగా సదరు ఛానల్ పై మండిపడ్డారు. “తానూ ఆ వీడియోను డిలీట్ చేయలేదని, కేవలం ప్రైవేటు వరకే పరిమితం చేసానని, దీనికి తగిన సాక్షాలు కూడా తన వద్ద ఉన్నాయని, రామ్ పై, తనపై కావాలని కుట్ర జరుగుతోందని, అసలు ఈ వీడియోకు రామ్ కు ఎలాంటి సంబంధం లేదని, కావాలని రామ్ ను ఇందులో ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా ఫ్యాన్స్ ని నమ్మక ద్రోహులు అనే అధికారం ఎవరిచ్చారు? పనికి మాలిన వార్తలను ప్రచారం చేస్తే టీవీ ఛానల్ కాదు, టీవీ షాప్ పెట్టుకునే స్థాయికి వెళ్తారు” అంటూ తీవ్రంగా స్పందించారు.

ఈ పరిణామాలన్నీ చూస్తున్న సినీ ప్రేక్షకులకు అసలు సదరు మీడియా ఛానల్ లో ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ… ఎవరికి వారు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే వీడియో అప్ లోడ్, ప్రైవేటు, డిలీట్ అన్న విషయాలు పక్కన పెడితే, అసలు ఈ విధంగా ఎందుకు “రివ్యూ” ఇవ్వాల్సి వచ్చిందనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న?!