ram-pothineni-hyperప్రిన్స్ మహేష్ బాబుతో వరుసగా మూడు సినిమాలను నిర్మించి, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన 14 రీల్స్ సంస్థపై సినీ ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతుంటారు. మహేష్ తో మొదటగా నిర్మించిన ‘దూకుడు’ సినిమాను మినహాయిస్తే… ‘1 నేనొక్కడినే, ఆగడు’ సినిమాల సందర్భంలో 14 రీల్స్ సంస్థ వ్యవహరించిన తీరు పట్ల ప్రిన్స్ అభిమానులు తీవ్రంగా మండిపడిన సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా టీజర్ల విడుదల విషయంలో ముందుగా ఒక సమయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తారు. కానీ, ఆ టైంకు ఖచ్చితంగా టీజర్ విడుదల కాదు. తమ అభిమాన హీరో టీజర్ కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూసే అభిమానగణం, రివర్స్ ఎటాక్ చేసినా ప్రయోజనం ఉండేది కాదు. ఎప్పటికో మళ్ళీ కొత్త సమయాన్ని ఇవ్వడం, ఈ సమయానికి కూడా ఒకటి, రెండు గంటలు వేచిచూసేలా చేయడం 14 రీల్స్ సంస్థకు షరామామూలే. ఒక రకంగా అభిమానులతో ఆడుకోవడం సదరు సంస్థకు వెన్నతో పెట్టిన విద్యలా మారిందని, చాలా సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడ్డారు.

ప్రిన్స్ సినిమానే కాదు, రామ్ సినిమాకైనా తమ తీరు ఇంతే అనే విధంగా వ్యవహరించడం మరోసారి సదరు సంస్థపై విమర్శలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. రామ్ తో తీస్తున్న “హైపర్” సినిమాకు సంబంధించి మ్యూజికల్ వీడియోస్ విడుదల చేస్తామని సదరు సంస్థే అధికారికంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన సంస్థ, యధావిధిగా ఆ సమయానికి విడుదల చేయలేకపోయింది. ఫ్రెష్ సమయాన్ని, ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట ప్రకటిస్తూ 5.30గా ఖరారు చేసారు.

అయితే ఈ ఆలస్యానికి గల కారణాలు ఏమిటంటే… యూ ట్యూబ్ లో సాంకేతిక లోపాలు కారణమని తెలియవచ్చింది. అదే నిజమైతే… ఉదయం నుండి సాయంత్రం వరకు సదరు సాంకేతిక సమస్యకు పరిష్కారం లభించలేదన్న మాట. మరి 5.30 నిముషాలకు ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తుతుందో చూడాలి… అని నవ్వుకోవడం నెటిజన్ల వంతవుతోంది. ఏదైనా ఒకసారి, రెండు సార్లు జరిగితే, దానిని ప్రేక్షకులు అర్ధం చేసుకోగలరు గానీ, ప్రతిసారి ఒకటే రిపీట్ అవ్వడం అంటే… అది ఉద్దేశపూర్వకం అనే నిర్ణయానికి సినీ అభిమానులు వచ్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త… నిర్మాతలు..!