ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఛార్మినార్ వద్ద సిగరెట్ తాగినందుకు చార్మినార్ పోలీసులు సినీనటుడు రామ్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ సందర్భంగా చార్మినార్ వద్ద బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాల్చినందుకు ఆయన రూ.200 జరిమానా కట్టారు. ఇది కొంత మేర వివాదాస్పదంగా మారింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై రామ్ స్పందించలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై రామ్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
“నా టైం, పబ్లిక్ టైం వృథా చేయడం ఇష్టంలేక ఇప్పటివరకు స్పందించలేదు తమ్మీ. షాట్లో సిగరెట్ కాల్చాను. విరామ సమయంలో కాదు. టైటిల్ పాటలో నేను సిగరెట్ కాల్చిన స్టెప్పు చూస్తారుగా..! అయినా కూడా నేను చట్టాన్ని గౌరవించి జరిమానా కట్టాను. లైట్ తీస్కో.. పని చేస్కో” అని పేర్కొన్నారు రామ్. అయితే ఛార్మినార్ పోలీసులు మాత్రం రామ్ షూటింగ్ బ్రేక్ లో పొగ తాగినందుకే జరిమానా విధించామని మీడియా సంస్థలకు వాట్స్ అప్ మెస్సేజ్ పెట్టడం గమనార్హం.
చార్మినార్ సిఐ షూటింగ్ బ్రేక్ లో రామ్‌కు COTPA Act 2003 Section 4 కింద 200 రూపాయల ఫైన్ వేశారు అని ఆ మెస్సేజ్ సారాంశం. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఛార్మి కౌర్ పూరీ కనెక్ట్స్‌తో కలిసి పూరీ టూరింగ్ టాకీస్ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 18న విడుదల కానుంది ఈ చిత్రం. ముందుగా జులై 12 అనుకున్నా కూడా వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో వారం వాయిదా వేసారు దర్శక నిర్మాతలు.