Ram Mohan Naidu KinjarapuTDP‘మద్యపాన నిషేధం’ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ద్వారానే మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తున్నారని లోక్ సభలో ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. “ఏపీలో కల్తీ మద్యం అమ్మకాల నేపధ్యంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని., ప్రజల ఆవేదనను అర్ధం చేసుకువాలని” కేంద్రాన్ని విన్నవించుకున్నారు ఎంపీ రామ్మోహన్.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లో మద్యం మాఫియా., బ్లాక్ మార్కెట్ దందాలు విపరీతంగా పెరిగిపోయాయని వాటిపై రాష్ట్రానికి ‘నియంత్రణ’ లేకపోగా, ‘పట్టు’ సాధించిందని, వైసీపీ వైఖరిని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు టీడీపీ నేతలు. ప్రభుత్వమే సొంత బ్రాండ్లను చౌకబారు ధరలకు కొనుగోలు చేసి వాటికి 4 రేట్లు ధరను పెంచి ప్రజలకు విక్రయిస్తోందని, వైసీపీ మద్యం పాలసీలో ఉన్న అవకతవకలను సరిచేయమంటూ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 18 మంది చనిపోతే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున ఉండిపోయిందని., ఆ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి చనిపోయిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు లోకసభలో తమ వైఖరిని టీడీపీ నేతలు తెలిపారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన విషయం కనుకనే సభ ముందుకు ఈ విషయాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు.

రాష్ట్ర మొండి వైఖరితో ప్రజలు విసిగిపోయారని కేంద్రమే దీనిపై స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుకున్నారు రామ్మోహన్ నాయుడు. ఇదే విషయమై రాష్ట్రంలో టీడీపీ నాయకులు కూడా ఎన్నో నిరసనలు., ఆందోళనలు చేశారని స్వయంగా తమ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి వారికి కొంత ఊరటను కలిపించారనే విషయం సభ ముందుంచారు ఎంపీ.

ప్రతిపక్షంగా తాము చేయాలసిందంతా చేసామని, అయినా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, తీసుకోవాల్సిన చర్యలు తక్షణమే తీసుకోకపోవడం వల్లే ఈ కల్తీ మద్యం బాధితుల గోడు పార్లమెంట్ గుమ్మంలోకి వచ్చిందని, అందుకే తన ఆవేదనను సభ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్ లో ఏపీ తరపున గళం వినిపించే నేతలలో రామ్మోహన్ పేరు ఎప్పుడూ ఒకటవ స్థానంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్లుగానే తాజాగా కూడా తన స్వరాన్ని వినిపించారు.