Ram Mohan Naidu Kinjarapu to lead TDP2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పొందింది. చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. వచ్చే ఎన్నికల నాటికీ ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి. కొందరైతే ఏకంగా చంద్రబాబు, బాలయ్య తప్ప ఎవరి మీద నమ్మకాలు లేవు అని అంటున్నారు.

ఈ తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో నాయకత్వ మార్పు కూడా చెయ్యాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వానికి పగ్గాలు అప్పజెప్పి కొత్త ఓటర్లను పార్టీ వైపు ఆకర్శించడం కీలకంగా మారింది.

ఆ దిశగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చెయ్యాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం. అనర్గళంగా మాట్లాడగల్గడం… యూత్ లో ఇమేజ్ ఉండడం…. అలాగే బీసీ వర్గం నుండి రావడంతో రామ్మోహన్ నాయుడుకి కలిసొచ్చింది అంటున్నారు.

అయితే గతంలో ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కేవలం అలంకార ప్రాయంగా ఉండే వారు. ఏదో చెప్పుకోవడానికి, పార్టీ సమావేశాలలో ముందు కూర్చోడానికి తప్ప వారు పెద్దగా చేసింది ఏమీ లేదు. రామ్మోహన్ విషయంలో కూడా అదే వైఖరి అవలంభింస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ విషయంలో చంద్రబాబుకు క్లారిటీ ఉంటే అది ఆ పార్టీకే మంచిది.