Ram Mohan Naidu Kinjarapu AS TDP president of andhra pradeshతెలుగుదేశం పార్టీలో తరువాతి నాయకత్వం గురించి ఈ మధ్య చర్చ మొదలయ్యింది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు 70వ పడిలో ఉండటం, లోకేష్ ఓడిపోవడంతో పార్టీలో నాయకత్వ లేమిపై అంతా మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రస్తుతానికి ముగింపు పలకడానికి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడిని నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి.

కొద్దిరోజుల్లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిమిడి ఓటమి పాలయ్యారు. నాయకత్వ విషయం చర్చకు వచ్చినప్పుడు చాలా మంది టీడీపీ అభిమానులు వాగ్ధాటి కలిగిన యువ నాయకుడు కింజరపు రామ్మోహన్నాయుడిని పార్టీ వాడుకోవాలి అని అభిప్రాయపడటం గమనార్హం. దీనితో ఈ నిర్ణయం కార్యర్తలకు కూడా ఆనందం కలిగించేలా ఉంటుంది.

అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావుగా ఉన్న సమయంలో ఆయన నామమాత్రంగానే ఉన్నారు. పెద్దగా పార్టీకి ఉపయోగపడింది లేదు. ఏదో ఒక బీసీ నాయకుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు అనే పేరుకి తప్పితే. రామ్మోహన్నాయుడిని కూడా అలానే వాడుకుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. రామ్మోహన్నాయుడిని యువతరాన్ని పార్టీ వైపునకు ఆకర్షించడానికి ఉపయోగిస్తేనే ఈ నియామకానికి సరైన అర్ధం. మరోవైపు ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.