Ram Mohan Naidu fires on AP Governmentజంగారెడ్డిగూడెం మద్యం మరణాల డైవర్షన్ లో భాగంగానే మళ్ళీ మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెర మీదకు తీసుకువచ్చారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులు అంటూ మూడు సంవత్సరాల ప్రభుత్వ విలువైన కాలాన్ని వృధా చేసి, ప్రజా ఆస్తులను కూల్చివేసే పనిలో బిజీగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.

మూడు రాజధానులంటున్న ఈ మూడు ప్రాంతాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టారా? ఒక్క నిర్మాణాన్ని అయినా పూర్తి చేయడం అటుంచితే అసలు మొదలు పెట్టారా? అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీలు. రాజ్యాంగం అంటూ పెద్ద పెద్ద పదాలు పలికే మీరు న్యాయస్థానాలకు కాని, న్యాయమూర్తులకు కాని, వారిచ్చే తీర్పులను కానీ ఏనాడైనా గౌరవించారా? అంటూ టిడిపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాజ్యాగం గురించి చదువుకోవడానికి మీరు, మీ నాయకులు తిరిగి పాఠశాలలకు వెళ్లి ఎనిమిదో తరగతి నుండి చదవండి అంటూ వైసీపీ నాయకులను ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే అలవాటు జగన్ ప్రభుత్వానికి లేదంటూ., రాజారెడ్డి రాజ్యాంగాన్నే జగన్ ఫాలో అవుతారని రామ్మోహన్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అడ్డొచ్చిన వారిని బెదిరించడం., నమ్మిన వారిని నట్టేట ముంచడం., తనను ఎదిరిస్తే సొంత వారినైనా అంతమొందించడం., ప్రజలను మభ్య పెట్టడం., ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయడం., తమ విధానాలను తప్పు పడితే న్యాయస్థానాలనైనా ఎదిరించడం., న్యాయమూర్తులను అవహేళన చేయడం రాజారెడ్డి రాజ్యంగంలో ఒక భాగమని, దానినే జగన్ రెడ్డి అనుసరిస్తున్నారంటూ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ప్రభుత్వంపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

కల్తీ మద్యం మరణాలు అంటే మూడు రాజధానులంటారు., పోలవరం అంటే పెగసిస్ అంటారు., అమరావతి అభివృద్ధి అంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటారు., మద్యపాన నిషేధం ఏదంటే పధకాలు అమలు చేయొద్దా అంటారు., రోడ్ల మర్మత్తులంటే కూల్చివేతల కార్యక్రమానికి తెర లేపుతారు, ఇలా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ఎత్తిచూపిన ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలకు దిగడం., డైవవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడంలో ముందుంటారని రామ్మోహన్ నాయుడు తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.