Ram Madhav on alliance with other partyతాము ఎవరికి జూనియర్ పార్టనర్ గా ఉండబోమని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వలసలను ఆపుకునేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రచారం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఆయన అన్నారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజోపయోగ పనులకు సహకరిస్తామని ఆయన అన్నారు. అయితే సొంతంగానే ఎపిలో వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలన్నది తమ లక్ష్యమని రామ్ మాధవ్ అన్నారు. రామ్ మాధవ్ చెప్పింది నిజమే. ఏ పార్టీ అయినా ఎక్కడైనా సొంతంగా బలపడాలి భావించడం సాధారణమే.

అయితే దానికి తగ్గ పని చెయ్యాల్సి ఉంటుంది. గత ఎన్నికలలో బీజేపీకి 1% ఓట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా కాంగ్రెస్ కంటే కాస్త మెరుగుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అద్భుతాలు చెయ్యాలని అనుకోవడం అత్యాశే. సరే ఆశకు అంతేముంది? కానీ దానికి తగిన పని చెయ్యాలి కదా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుసన్నల్లో పెట్టుకుని ఆ డిమాండ్ పైకి రాకుండా చేస్తున్నారు.

అలాగే రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు అనే మాట కూడా రానివ్వడం లేదు. అంత మాత్రాన అసలు ఏమీ చెయ్యకుండా బలపడటం ఎలా సాధ్యం అవుతుంది? మనకంటూ చెప్పుకోవడానికి ఏదన్నా ఉండాలి కదా? వలస నాయకులే ఓట్లు తెస్తారనుకుంటే అది వారి భ్రమే అవుతుంది.