ram-gopal-varma-vangaveeti-ranga-movie-highlightsవిజయవాడకు – వంగవీటి కుటుంబానికి విడదీయలేని బంధం ఉంది. బెజవాడ వేదికగా సాగిన ‘రక్తచరిత్ర’ దాదాపుగా అందరికీ సుపరిచితమే. అయితే దీనిని ప్రస్తుతం దర్శకుడు రాంగోపాల్ వర్మ దృశ్య రూపంలోకి తీసుకు రాబోతున్న తరుణంలో… వంగవీటి కుటుంబానికి ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత రీత్యా ఈ సినిమాలో వర్మ అసలేం చూపించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ విషయమై ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వర్మ పలు విషయాలు స్పష్టం చేసారు. “వంగవీటి” అనే సినిమాలో హీరోలు, విలన్లు అనేది ఎవరూ ఉండరని, కేవలం ఆయా పరిస్థితులలో ఆ ప్రముఖ వ్యక్తులు ఎలా ప్రవర్తించారు? అనే ఎమోషన్స్ మాత్రమే ఉంటాయని తెలిపారు. అయితే సినిమాలో దేవినేని నెహ్రూ, గాంధీలతో పాటు అన్ని పాత్రలు సినిమాలో ఉంటాయని స్పష్టం చేసారు.

ఇక, “వంగవీటి” సినిమాలో మేజర్ హైలైట్ గా వంగవీటి రంగా ప్రేమకథ ఉంటుందని అన్నారు. రత్నకుమారి గారి ప్రవర్తన, ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా సినిమాలో మేజర్ ఎపిసోడ్ ఉంటుందని స్పష్టం చేయడంతో “వంగవీటి” సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి అప్పట్లో వంగవీటి రంగా పెళ్లి ఒక సంచలనం. అప్పటివరకు విభేదిస్తున్న సామజిక వర్గపు మహిళను రంగా ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్లకే రంగా మరణం చెందడం వంటివి జరిగాయి. దీంతో రత్నకుమారి ఎపిసోడ్ అనేది “వంగవీటి” సినిమాకు ప్రధాన ‘హైలైట్’ కాబోతోందని వర్మ చెప్పకనే చెప్పారు.