ram charan ciranjeevi rare photoరెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన చిరంజీవి, అభిమానుల మదిలో ‘మెగాస్టార్’గా ముద్ర వేయించుకున్నారు. దీంతో ఆ ‘మెగా’ వృక్షం క్రింద ఎంతో మంది ‘సేద’ తీరుతున్నారు. పవన్ కళ్యాణ్ మొదలుకొని వరుణ్ తేజ్ వరకు చాలా మంది హీరోలు వచ్చినా చిరు ప్రదర్శించిన నటనకు ఏ ఒక్కరూ అందుకోలేదన్నది జగమెరిగిన సత్యమే. క్రేజ్ రీత్యా పవన్ తన అన్ననే మించిపోయినప్పటికీ, నటన పరంగా చిరు దరిదాపుల్లోకి కూడా రారన్నది అభిమానులు సైతం అంగీకరించే వాస్తవం. ఇక, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల పరిస్థితి అయితే విశ్లేషకులకు అందనిది. అయితే ఆ ‘మెగా’ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతున్న వారికీ వర్మ ఇచ్చిన సమాధానం సరైనదేనా?

‘మెగాస్టార్’ తర్వాత ఆ స్థాయిని అందుకునే హీరో వరుణ్ తేజ్ మాత్రమేనని ‘లోఫర్’ చిత్రం చూసిన తర్వాత వర్మ ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు. అయితే వర్మ వ్యక్తపరిచిన ఈ అభిప్రాయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. వరుణ్ ను కాసేపు పక్కన పెడితే, ‘మెగా’ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కు ‘మెగాస్టార్’ కిరీటం కట్టపెట్టాలని ‘మెగా’ క్యాంప్ చెర్రీని ప్రమోట్ చేస్తున్న విషయం బహిరంగ విషయమే. అయితే చెర్రీకి ఆ సామర్ధ్యత ఉందా… లేదా… అన్న విషయం పక్కన పెడితే, స్వయంగా చిరంజీవి సైతం పలు సందర్భాలలో రామ్ చరణ్ ను అతిశయోక్తులతో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి.

ఇదెలా ఉంచితే, ఇక ఇప్పటివరకు నటించిన చిత్రాలలో ఒక్క ‘మగధీర’ చిత్రంలోనే చెర్రీ అభినయంపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అలాగే ఒక నటుడిగా చెర్రీ నిరూపించుకున్న సినిమా ఒక్కటీ లేదు. కమర్షియల్ గా ఎన్ని సక్సెస్ లు అందుకున్నా, నటుడిగా చెర్రీని ప్రశంసించిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో ‘మెగాస్టార్’ హోదాకు చెర్రీ అర్హుడు కాదని వర్మ కూడా పరోక్షంగా అభిప్రాయపడ్డారా? అన్న రీతిలో చర్చలు మొదలయ్యాయి. మెగా వీరాభిమానుల మాట ఎలా ఉన్నా.., రామ్ చరణ్ కు ‘మెగాస్టార్’ ఇమేజ్ సొంతం కావాలంటే సాధ్యమయ్యే విషయమేనా? చిరు ‘ఆశ’ నేరేవేరేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలంటారా..!