సినిమా విడుదలయ్యే వరకు మీడియాలలో హంగామా చేయడం వర్మకు కొత్తేమీ కాదు. అందులో భాగంగానే తన తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్” కోసం విఫల యత్నాలు చేస్తున్నారు. “ఎన్టీఆర్ – కథానాయకుడు” సినిమా ఫలితం వర్మకు మరింత ఊతమిచ్చిందని వర్మ గారి ‘మిడ్ నైట్ ట్వీట్లు’ స్పష్టం చేస్తున్నాయి. తన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ట్రైలర్ విడుదల విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘ఎన్టీఆర్ – కధానాయకుడు’ సినిమాను ఎద్దేవా చేసే ప్రయత్నం చేసారు వర్మ.

ఎన్టీఆర్ ఆశీస్సులు తన సినిమాకే ఉండడం వలన, ‘ఎన్టీఆర్ – కధానాయకుడు’ సినిమా వైఫల్యం చెందిందని, ఇంతకంటే మరో ప్రత్యక్ష రుజువు అవసరం లేదని చెప్తూ వరుస ట్వీట్లు చేసారు వర్మ. ఇలాంటి లాజిక్ లలో వర్మకు మరొకరు సాటిరారు గానీ, ఇంతే విధమైన లాజిక్స్ తాను దర్శకత్వం వహించే సినిమాలలో కూడా పెడితే వరుస హిట్లు అందుకునే వారు కదా.. ? అన్నది ప్రేక్షకుల లాజిక్ పాయింట్. మరి ఇంత హంగామా చేస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో ఈ పాటి లాజిక్స్ అయినా ఉంటాయో? లేదో? చూడాలి.

తన సినిమాలు రిలీజ్ అయ్యే వరకు చేసిన హంగామాకు రిలీజ్ రోజుతో ‘శుభం కార్డు’ వేయడం వర్మకు పరిపాటి. మరి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలోనూ అదే జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. నిర్మాత మార్చి లో రిలీజ్ అంటున్నారు గానీ, ఇటీవల వర్మ సినిమాల రిలీజ్ ల ట్రెండ్ చూస్తుంటే ఇంకొంత కాలం ఆలస్యం అయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నది ట్రేడ్ టాక్. ఎందుకంటే జనవరి 26 విడుదల అంటూ ఇప్పటికే ఓ సారి ప్రకటించి వాయిదా వేసిన సంగతి సినీ ప్రేక్షకులకు తెలియనిది కాదు.