Ram gopal Varma Reveals on Chalasani Venkataranam murderఎప్పుడూ లేనంతగా తన ‘వంగవీటి’ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ ఇస్తున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… చలసాని వెంకటరత్నంను 72 సార్లు పొడిచారని పోలీసు రికార్డుల్లో ఉందని తెలిసి ఆశ్చర్యపోయానని, ఒక మనిషిని 72 సార్లు పొడిస్తే కానీ చావరా? అనిపించిందని, అయితే ఒక వ్యక్తిని కలిసి దీనిపై రీసెర్చ్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ తెలిశాయని, అతనిని చంపాలన్న తొందరతో పాటు, ఈ అవకాశం పోతే మళ్లీ రాదన్న ఆలోచన కూడా ఆయనను రౌండ్ చేసిన 12 మందిలో ఉందని, దీంతో ఆయనను 72 సార్లు పొడిచి చంపారని తెలియడంతో నిజమే అనిపించిందని అన్నారు.

నిజానికి అప్పట్లో విజయవాడలో అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదని, విజయవాడ ప్రజల్లో ఉన్న స్పెక్యులేషన్సే వాస్తవాలన్న ఆలోచనలో వారు ఉన్నారని, తాను అవి తప్పని చెప్పడం లేదని, అవుననీ చెప్పడం లేదని, తానేం చెప్పానో సినిమాలో చూసి తెలుసుకోవాలని అన్నారు. తాను తీసిన సినిమాను చూసి పాత గాయం రేగుతుందని అనుకోవడం భ్రమ అని, ‘వంగవీటి’ సంఘటనలన్నీ రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటనలని, ఆ రెండు కుటుంబాలకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకని ప్రశ్నించారు. వాస్తవాలను చూడడం మానేసి ఊహల్లోనే ఉండకూడదని తెలిపారు.

‘వంగవీటి’ కథను 5 భాగాలుగా తీసినా పూర్తి కాదని, ‘వంగవీటి’ లాంటి అద్భుతమైన కథతో మళ్లీ సినిమా తీయడం జరుగుతుందో, లేదోనన్న ఆలోచనతోనే రిటైర్మెంట్ ప్రకటించానని, ఈ కథలో పూర్తిగా లీనమై తీశానని, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ సినిమాను ఒక అంచనాతో చూసే వారిని తాను ఆనందింపజేయలేనని స్పష్టం చేసిన వర్మ, అలా కాకుండా తానేం చెప్పానన్న దానిని చూస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకునే అవకాశం ఉండదని చెప్పారు.