ఇవివి సినిమాలో చూపించినట్లు… రొటీన్ గా చప్పట్లు కొట్టడం నాకు నచ్చదు, చిటికెలు చిటికెలు అనే విధంగా ఎప్పుడూ సమకాలీన అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలవడం ఒక్క రామ్ గోపాల్ వర్మకే చెల్లుబాటు అయ్యింది. ప్రతి అంశంలోనూ కొత్తదనాన్ని తెరపైకి తీసుకువచ్చి, మీడియా ముంగిట వాలే ఆర్జీవీ, తొలిసారిగా పద్ధతిగా మాట్లాడడం ఒకింత విస్మయానికి గురిచేసే అంశమే.
బహుశా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిపై ఉన్న గౌరవమే వర్మ చేత ఇలా పలికించిందో ఏమో గానీ, సిరివెన్నెల అకాల మరణంపై ఒక సాధారణ మనిషి స్పందించినట్లుగా రామ్ గోపాల్ వర్మ తన స్పందనను తెలియజేసారు. అవును వర్మ ఇలా ఇంతవరకు ఎవరిపై ఇంతటి స్పందనను తెలియజేయలేదు, ఈ రకంగా కూడా వార్తల్లో నిలిచారు మరి!
‘శివ’ సినిమాలో ‘బోటనీ పాఠముంది’ అనే పాటతో మొదలైన ప్రస్థానం నుండి నేడు జరిగిన ఘటన, షాకింగ్ గురయ్యానని, శాస్త్రి గారు లేనందుకు బాధపడినా, ఆయన ఒక మార్గదర్శకంగా ఉన్నారని, ఆయన రచనలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంటాయని, భౌతికంగా లేకపోయినప్పటికీ, ఆయన పని ఎప్పటికీ బ్రతికే ఉంటుంది… అందుకు ఆనందంగా ఉందంటూ తన అనుభూతులను పంచుకున్నారు.
నమ్మలేకున్నా… నిజంగా ఇది వర్మనే చెప్పారండి..! అప్పుడప్పుడు అలా అద్భుతాలు జరిగిపోతుంటాయి… ఇది కూడా అందులో ఓ భాగమే అనుకోవాలి.