Ram Gopal Varma next movie  Dishaప్రజలలో ఉన్న బర్నింగ్ టాపిక్ ని తీసుకుని సినిమా చెయ్యడం, ఆ పబ్లిసిటీని సినిమాకు వాడుకోవడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు. పరిటాల రవి కథ నుండి నిన్న మొన్నటి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వరకూ ఆయన చేసింది అదే. అయితే సినిమాలకు బాగా పబ్లిసిటీ దక్కినా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా పని చెయ్యలేదు అది వేరే విషయం. తాజగా ఆయన దిశ రేప్ కేసు మీద దృష్టి సారించారు.

‘‘నా తర్వాతి సినిమా పేరు ‘దిశ’. దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. ఒకప్పటి రేపిస్ట్‌ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్‌లు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నాను. నిర్భయను రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి పరిస్థితి తమకు ఎదురుకాకూడదని దిశను రేపిస్ట్‌లు కాల్చి చంపేశారు’’ అని వెల్లడించారు.

‘‘నిర్భయను జంతువుల్లాంటి వ్యక్తులు రేప్ చేశారు. ఇప్పుడు ఆమెను మన న్యాయవ్యవస్థ రేప్ చేస్తోంది. మిస్టర్ నరేంద్ర మోదీ.. నిర్భయ తల్లిదండ్రుల బాధను మీరు అర్థం చేసుకోగలరా? అన్ని కోర్టులు కలిసి దోషులకు ఉరి పడకుండా చేస్తున్నాయి. నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లికి సవాలు విసిరాడట. దోషులకు ఎప్పటికీ ఉరి పడదు అని అన్నాడట. వినడానికి ఇంతకంటే దరిద్రమైన విషయం మరొకటి ఉండదు. ప్రజలకు న్యాయవ్యవస్థపై కంటే తెలంగాణ పోలీసులపైనే ఎక్కువ నమ్మకం ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో రాము ఎన్నుకున్న సబ్జెక్టుల మీద రకరకాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి. చాలా వాటిలో చాలా మంది ఆయనకు రకరకాల ఉద్దేశాలు కూడా ఆపాదించారు. అయితే మొట్టమొదటి సారి రాము చేస్తున్న ఒక ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే దీనిని ఆయన నిజాయితిగా తెరకెక్కిస్తారు అనే అనుకుందాం.