ram gopal varma manchu manoj attack movie release dateమంచు మనోజ్‌ హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన ‘ఎటాక్‌’ చిత్రం విడుదల వాయిదాలు పడుతూ వస్తోంది. దాదాపు ఆరు నెలలకు ముందే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అప్పుడే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆకట్టుకునే విధంగా ట్రైలర్‌ ఉండటంతో సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూశారు. కాని ఈ సినిమా ఏవో కారణాల వల్ల విడుదలకు ఇంత కాలం నోచుకోలేదు. తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మాఫియా నేపథ్యంలో మనోజ్‌ మాస్‌ పాత్రలో నటించిన ఈ ‘ఎటాక్‌’ చిత్రంలో జగపతిబాబు మరియు ప్రకాష్‌ రాజ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసినా కూడా నిర్మాణాత్మక విలువలు బాగుంటాయని అంటున్నారు. వర్మ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. డిసెంబర్‌ రెండవ లేదా మూడవ వారంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర నిర్మాత కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు.