Ram gopal varma making movie For YS Jaganవివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ చేత వైసీపీ నేతలు ఓ సినిమా తీయించబోతున్నట్లు సోషల్ మీడియా గుప్పుమంటోంది. రాయలసీమకు చెందిన ఓ వైసీపీ ఎంపీ దీనికి పెట్టుబడి పెడుతున్నారని, ఈ సినిమా టైటిల్‌ ‘జగన్నాధ రధచక్రాలు’ అని వాటి సారాంశం. తమ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉండవచ్చని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు గెలుచుకొంటుందని సిఎం జగన్ చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నందున, టిడిపి, జనసేనల పట్ల ప్రజలలో విముఖత పెంచేందుకు వర్మ చేత ఓ సినిమా తీయించి సరిగ్గా ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే రాంగోపాల్ రాంగోపాల్ వర్మ స్వయంగా ఎలాగూ దీని గురించి డప్పుకొంటారు కనుక ఈ వార్త నిజమా కాదా అనేది తేలిపోతుంది. అయితే ఎన్నికల వైతరిణి దాటడం కోసం సమాజం చేత ఏవగింపబడుతున్న రాంగోపాల్ వర్మని నమ్ముకోవడం అంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడం వంటిదే అని చెప్పక తప్పదు.

ఎందుకంటే ఓ పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారిన రాంగోపాల్ వర్మ గతంలో కూడా టిడిపిని దెబ్బ తీసేందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి చెత్త సినిమాలు తీసి అందరి చేత ఛీకొట్టించుకొన్నారు. అయితే ఆ సినిమాల ప్రభావం వలననే తాము 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చామని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తునట్లయితే, జనం తన ఫోటో చూసి ఓట్లేస్తారని గర్వంగా చెప్పుకొనే ఆయనకే అవమానం.

ముఖ్యంగా జనసేనను చావుదెబ్బ తీసేవిదంగా ఈ సినిమాను నిర్మించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచి చెపుతున్న సంగతి తెలిసిందే. కనుక ఈ సినిమాతో కమ్మ, కాపు ఓట్లు చెల్లాచెదురైపోయేలా చేయగలిగితే వచ్చే ఎన్నికలలో టిడిపిని అవలీలగా ఓడించవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుండటం సహజమే. కానీ సినిమాలు చూసి ప్రజలు గుడ్డిగా ఓట్లేసేస్తారనుకొంటే సినీ పరిశ్రమతో బలమైన అనుబందం ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారు కదా?సినిమాలతో రాజకీయాలను శాశించవచ్చనుకొంటే ఆనాడు చిరంజీవి, ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలలో ఓడిపోయేవారు కారు కదా? సినీ పరిశ్రమలో ప్రముఖులు సిఎం జగన్మోహన్ రెడ్డి ఎదుట చేతులు జోడించి ప్రాధేయపడేవారూ కారు కదా?

అయినా 175 సీట్లు గెలుచుకొంటామని చెపుతూ కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడానికి వైసీపీ సిద్దపడితే తాము ప్రజలకు ఏమి సంకేతాలు పంపుతున్నామని వైసీపీ గ్రహించారో లేదో?