ram-gopal-varma Lakshmi NTR ఒక దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ప్రకటించినన్ని సినిమాలు, బహుశా ఇండియాలో ఏ దర్శకుడు కూడా ప్రకటించి ఉండరు. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచనను ఒక కధగా మలిచేసుకుని, అప్పటికప్పుడు సినిమా పేరును ప్రకటించడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం… ఈ లోపున దానిని మీడియా వర్గాల ద్వారా రచ్చ రచ్చ చేయడం… వర్మకు తెలిసినంతగా ఇండియాలో(బహుశా ప్రపంచంలో కూడా అనవచ్చేమో) ఇంకెవరికి తెలియదు అని చెప్పడంలో సందేహం లేదు.

గత రెండు, మూడేళ్ళ కాలం నుండి వర్మ ప్రకటించిన సినిమాల జాబితా సంఖ్యను చూస్తే… ఒక టాప్ డైరెక్టర్ కెరీర్ మొత్తంలో కూడా అన్ని సినిమాలకు దర్శకత్వం వహించకపోవచ్చు. టైటిల్ ప్రకటన… ఆ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ తో సందడి చేయడం అలవాటైన వర్మకు ఇటీవల ఎన్టీఆర్ జీవితగాధ తారసపడింది. ఇంకేముంది… “లక్ష్మీస్ ఎన్టీఆర్” అంటూ హంగామా చేయడం తాజాగా… ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లుగా ఉన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం… జరిగిపోయాయి.

ఇంతే… మరి ఇంతకుమించి ఇంకేమైనా ఉంటుందా..? అంటే… ఏమి ఉండదన్న సమాధానమే లభిస్తుంది. గతంలో ‘సావిత్రి’ సినిమా విషయంలోనూ ఇలాగే ఫస్ట్ లుక్ తో పిచ్చేక్కించిన విషయం తెలిసిందే. ఇలాంటి హంగామా సృష్టించడం వర్మకు ఒక క్రేజ్ లాంటిది. బహుశా ఫుల్ సినిమాలు తీసినా రానటువంటి కిక్, ఇలా ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేయడం ద్వారా వర్మకు వస్తుందేమోనని అనిపించే విధంగా ఆసక్తికరంగా రూపకల్పన చేస్తారు. కానీ ఫస్ట్ లుక్ లపై చూపించే శ్రద్ధ సినిమాలు తీయడంపై ఉండడం లేదని చాలా సినిమాలు ఇప్పటికే నిరూపించాయి.