Ram Gopal Varma comments on  Pawan Kalyan Ijam Book‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు రాసిన బహిరంగ లేఖను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు. పవన్ పుస్తకం ‘ఇజం’ గురించి వర్మ రాసిన ఓ లేఖ హైదరాబాద్ టైమ్స్ లో ప్రచురితం కాగా, దానిని తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ పోస్ట్ చేశారు.

“హేయ్ పవన్…
మీరు రాసిన ‘ఇజం’ పుస్తకం గురించి మాట్లాడే ముందు, మీకు ఒక విషయం చెప్పాలి. రాజకీయ పార్టీని పెట్టాలనే మీ ఐడియాను నేను చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నా. మీలో ఉన్న నిజాయతీ నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంది. ‘జనసేన’ పార్టీ ప్రారంభించిన సమయంలో మీ ప్రసంగం నన్ను ఎంతో ఆకట్టుకుంది. మీ ‘ఇజం’ పుస్తకం లాంచ్ అవుతోందని విన్నప్పుడు నేనెంతో ఎక్సైట్ మెంట్ కు గురయ్యా. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం అలవాటు.

నేను విజయవాడలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఇమ్మాన్యుయేల్, ఆర్థర్ స్కోపెన్ హ్యూయర్, డెస్కార్టెస్, విలెమ్ హేగల్, ఫ్రెడ్రిచ్ నీష్, బరూచ్ స్పినోజా, రాండ్ ల పుస్తకాలను చదివా. ఆ తర్వాత పలువురు ఆధునిక తత్వవేత్తల పుస్తకాలను చదివా. సమాజాన్ని ఎలా మార్చాలన్న అంశంపై వీరు ఎంతో లోతుగా ఆలోచించారు. వీరి ఆలోచనా విధానానికి కొనసాగింపు మీ ఇజం పుస్తకంలో ఉంటుందని నేను ఆశించా. సమాజం పట్ల మీలో ఉన్న తపన, మీకు ఉన్న అవగాహన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని… నేను ఆ విధంగా ఆశించాను.

కానీ, ఇజం పుస్తకాన్ని చదివిన తర్వాత… గ్రేట్ సోషియల్ ఫిలాసఫీలను మీ సహ రచయిత రాజు రవితేజ్ ఓ ఎలిమెంటరీ స్కూలు పిల్లాడి మాదిరిగా అర్థం చేసుకున్నాడని నాకు అనిపించింది. నేను రాజు రవితేజ్ గురించే ముందు ఎందుకు మాట్లాడుతున్నానంటే… ఇజం పుస్తకానికి సంబంధించి పుస్తక రచయితగా ఎక్కువ క్రెడిట్ రాజు రవితేజ్ కే దక్కుతుంది. ఇజం పుస్తకం సమాజానికి సంబంధించినది కాబట్టి… దీనికి సంబంధించి నా విశ్లేషణను బహిరంగంగా చెప్పాను.

ఇజం పుస్తకంలో మీరు చెప్పిన దాని కన్నా ఎక్కువ జ్ఞానం మీకుంది. మీ ప్రసంగాలు, మీ మాటలు, మీ హావభావాల ద్వారా ఇది నాకు అర్థమవుతోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి ఫిలాసఫీలు తప్పుడు సిద్ధాంతాలను కూడా తెరపైకి తెచ్చాయి. అలాంటి వాటిని మీరు మళ్లీ వాడుకోవడం అనవసరం. ఆర్థర్, ఇమ్మాన్యుయేల్ ల పుస్తకాలను మీరు చదవలేదని నాకు అర్థమవుతోంది. మీరు పూర్తిగా మీ ప్రైమరీ రైటర్ రాజు రవితేజ్ పైనే ఆధారపడ్డారు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. పాత ఫిలాసఫీలు అన్నీ ఆధునిక సమాజ నిర్మాణంలో పూర్తిగా వాడుకోబడ్డాయి.

ఇప్పడు వాటి అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది 100శాతం పవనిజం మాత్రమే. మీ తొలి ప్రసంగంలో మీరు చెప్పిన లక్ష్యాలను తాకే విధంగా ఇజం పుస్తకంలో 90 శాతం లేదు. బ్రూస్ లీ ఒక ఫైటరే కాదు. ఒక ఫిలాసఫర్ కూడా. జ్ఞానం అనేది పైకి ఎక్కడానికి ఉండే నిచ్చెన మెట్లులా ఉండాలని బ్రూస్ లీ ఒకానొక సమయంలో చెప్పాడు. కానీ, మనం ఎక్కిన ప్రతి మెట్టును మనం సేకరించుకుంటూ పోతే… ఒకానొక రోజు మెట్ల బరువు మనల్ని మరింత పైకి ఎక్కనివ్వకుండా అడ్డుకుంటుంది. నిన్ను ఏదైతే ముందుకు తీసుకెళుతుందో… దాన్ని నీతో తీసుకుపోవాలని అనుకోకూడదు.

హేయ్ పవన్… నేను బ్రూస్ లీ గురించి ఎందుకు చెప్పానంటే… ఆయనలోని తీవ్రత, చిత్తశుద్ధి మీలో కూడా ఉన్నాయి. బ్రూస్ లీ శైలి ప్రత్యేకమైనదిగా ఎందుకు నిలిచిపోయిందంటే… ఇతరుల వల్ల ప్రభావితం కాకుండా తనను తాను కాపాడుకున్నాడు కాబట్టి. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే వ్యక్తపరుస్తున్నారో… అదే మీ సొంత ఫిలాసఫీగా ఉండాలి. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తిగా, మీ శ్రేయోభిలాషిగా మీకు ఇదంతా చెబుతున్నా. చివరగా ఓ మాట. మీ ఇజం పుస్తకంతో నేను చాలా నిరాశ చెందా. కానీ, పవనిజం మీద మాత్రం నాకు ఇంకా నమ్మకం ఉంది.

ట్విట్టర్ వీడిన తర్వాత పవన్ కళ్యాణ్ పై పెద్దగా స్పందించని వర్మ, మళ్ళీ ఫేస్ బుక్ లో స్పందిచడంతో… “తగులుకున్నాడు బాబోయ్…. మళ్ళీ తగులుకున్నాడు…” అంటూ తల పట్టుకోవడం అభిమానుల వంతవుతోంది.తోంది.