Ram Gopal Varma biopic NTR Newsస్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితగాధను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తారన్న సమాచారం వెలువడగానే, ఉలిక్కిపడిన సినీ, రాజకీయ వర్గాలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, బాలకృష్ణ హీరోగా ఉంటే ఈ సినిమాకు న్యాయం జరగదని తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా టిడిపి – వైసీపీ బద్ధశత్రువులు కావడంతో, ప్రస్తుతం వైసీపీలో ఉన్న పార్వతి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి పోసాని కృష్ణమురళీ స్పందించారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర వర్మకు తెలుసని చెప్పిన పోసాని, ఈ సినిమాను మాత్రం తీయవద్దని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఒకవేళ ఖచ్చితంగా తీసి తీరుతాను అంటే మాత్రం… అందరి అభిప్రాయాలు తెలుసుకోవాల్సిందేనని, వ్యక్తిగత జీవితం ముట్టుకోకుండా బయోపిక్ తెరకెక్కడం అసాధ్యం గనుక, దానిని తీసి నందమూరి కుటుంబాన్ని బాధపెట్టడమేనని, అందుకే బయోపిక్ తీయవద్దని చెప్తున్నా అన్నారు. వర్మ గారికి వ్యక్తిగతంగా తను చేస్తున్న విజ్ఞప్తిగా పోసాని అభిప్రాయపడ్డారు.

అయితే ‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్’గా వెళ్ళిపోయే వర్మ, ఈ విజ్ఞప్తులను పట్టించుకుంటారా? అంటే దానికి సమాధానం అందరికీ తెలిసిందే. కేవలం ప్రకటన తర్వాత స్పందనలే ఇలా ఉంటే, రేపు సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత, షూటింగ్ జరుగుతున్న సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం… కధ ఉన్నా, సినిమాలో అసలు విషయం లేకుండా తెరకెక్కించడంలో వర్మ సిద్ధహస్తులు కాబట్టే బాలకృష్ణ, ఈయనను ఎంచుకున్నారేమో!