ram gopal varma bheemla nayakసంచలన ప్రకటనలకు వేదికగా నిలిచే ప్రముఖ దర్శక దిగ్గజం రాంగోపాల్ వర్మ, మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేసారు. పవన్ నటించిన తాజా చిత్రం “భీమ్లా నాయక్” త్వరలో విడుదల కాబోతున్న నేపధ్యంలో… ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం ఈ ట్వీట్ల సారాంశం.

రొటీన్ గా ఇలాంటి డిమాండ్ చేస్తే ఇందులో వర్మ మార్క్ ఏముంటుంది, ఈ సందర్భంగా ఇతర హీరోలతో పోలుస్తూ తనదైన శైలిలో స్పందించారు వర్మ. ఇటీవల బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన “పుష్ప”తో ప్రారంభించి, మీ తర్వాత వచ్చిన పిల్లలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయిపోతుంటే, మీరింకా మడి కట్టుకుని కూర్చుంటారా? అన్న భావాలను వ్యక్తపరిచారు.

ఇవన్నీ వర్మ వ్యక్తపరచడానికి ఎంచుకున్న లాజిక్ ఏమిటంటే… పవన్ నటించిన “సర్ధార్ గబ్బర్ సింగ్” మూవీ. ఈ సినిమాను హిందీలో విడుదల చేయొద్దు, వర్కౌట్ అవ్వదని ముందే చెప్పాను, మీరు వినలేదు, ఫలితం చవిచూసారు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా “భీమ్లా నాయక్” సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయండి అంటూ ప్రారంభించారు.

అల్లు అర్జున్ నటించిన “పుష్ప”యే అంత వసూలు చేస్తే, ఇక పవర్ స్టార్ నటించిన “భీమ్లా నాయక్” ఇంకెంత వసూలు చేయాలి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేము బన్నీ ఫ్యాన్స్ కు జవాబు చేయలేము అంటూ ఇరువురి అభిమానుల నడుమ ఓ పుల్ల వేసారు.

అల్లు అర్జున్ గురించి చేసిన ట్వీట్స్ అన్ని నా వోడ్కా టైములో చేసినవి, కానీ మీ కోసం నా కాఫీ టైములో చేస్తున్నా, దీన్ని బట్టి తన సీరియస్ నెస్ ను పవన్ అర్ధం చేసుకోవాలని వర్మ చెప్పుకొచ్చారు. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా మారగా, ఇంకా మీరు ఒక్క తెలుగునే అంటిపెట్టుకుని ఉండడం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటిప్రాయంగా ఉందని అన్నారు.

‘భీమ్లా నాయక్’ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ‘సబ్కా బాప్ మీరేనని’ నిరూపించండి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రలో ఓ మారుమూల జరిగిన “పుష్ప” సబ్జెక్టు పాన్ ఇండియా అయినపుడు, కొమరం భీమ్, అల్లూరిల వంటి తెలుగు వారి కధలు పాన్ ఇండియా అయినపుడు, భీమ్లా నాయక్ పాన్ వరల్డ్ సబ్జెక్టు కాదంటారా పవన్ కళ్యాణ్ గారు? అంటూ ప్రశ్నించారు.

వర్మ ట్వీట్లు చూసిన తర్వాత “ఆది” సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చెప్పే డైలాగ్స్ గుర్తుకు రావడం సహజం. హీరోయిన్ లవ్ లెటర్ తీసుకొచ్చి ఎల్బీ శ్రీరామ్ కు ఇచ్చిన సందర్భంలో… ‘ముందు వాడు ఏం చెప్తున్నాడో నీకర్థమైతే, అది తీసుకొచ్చి నాకు చెప్పు, ఆ తర్వాత వాడి మీద యాక్షనో, రియాక్షనో నేను తీసుకుంటాను’ అంటాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ కూడా అలాగే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ చేసారో లేక తక్కువ చేస్తూ చేసారో లేక ఎటకారాన్ని ప్రదర్శించారో అర్ధం కానీ రీతిలో ట్వీట్ల వర్షాన్ని అయితే కురిపించారు. ఎప్పుడూ ఏదొక అంశంతో లైం లైట్ లో ఉండే వర్మ, ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ ను ఎందుకు తగులుకున్నారో పవర్ స్టార్ అభిమానులకు కూడా అంతు పట్టడం లేదు. ఒకప్పుడు ఇలాగే పవన్ పై ట్వీట్లు చేయగా, అప్పుడు పవన్ ఫ్యాన్స్ Vs వర్మకు ఓ మినీ యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే.