RGV- Ram Gopal Varama - Pawan Kalyanమీడియాను ఎలా వాడుకోవాలో, తన సినిమాలకు ఎలా పబ్లిసిటీ చేయించుకోవాలో రాంగోపాల్ వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకటే ఫీట్ ను రకరకాలుగా చేస్తూ విజయవంతం అవుతోన్న వర్మ, తాజాగా నాగార్జునతో తీసిన “ఆఫీసర్” సినిమాకు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అయితే వర్మ ఈ సారి ఎంచుకున్నది పవన్ కళ్యాణ్ అభిమానులను!

ఇటీవలే ఆఫీసర్ రెండో టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ టీజర్ కూడా విఫలం కాగా, 1 మిలియన్ క్లిక్స్ దాటిన ఈ టీజర్ కు 14 వేల లైక్స్, 11 వేల డిస్ లైక్స్ వచ్చాయి. డిస్ లైక్స్ కొట్టిన వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులే అన్న ఉద్దేశంలో… ఈ 11 కోట్ల మంది ప్రజల్లో పవన్ అభిమానులు కేవలం 11 వేలేనా? అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేసారు.

దీనిని నిజంగా సీరియస్ గా తీసుకున్నారో లేక వర్మ వ్యాఖ్యల ప్రభావమో గానీ, అంతలోనే ఆ డిస్ లైక్స్ సంఖ్య 15 వేలకు పెరిగింది. అయితే వర్మకు కావాల్సింది లైక్స్, డిస్ లైక్స్ మ్యాటర్ కాదు, తన టీజర్ క్లిక్స్ మరింతగా పెరగాలి. దాన్నయితే విజయవంతంగా పూర్తి చేసినట్లే కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఈ టీజర్ 1.6 మిలియన్ క్లిక్స్ దాటి 2 మిలియన్ వైపుకు పరుగులు పెడుతోంది.