Ram Gopal review on RRR Movieఎదుటి వారిని కన్ ఫ్యూజ్ చేస్తూ మాట్లాడడంలో సిద్ధహస్తుడు మన రాంగోపాల్ వర్మ. అలాంటి రాంగోపాల్ వర్మకే మాటలు రాకుండా చేసాడు మన రాజమౌళి. అవును… ఈ విషయాన్ని స్వయంగా వర్మ చెప్పడం అటుంచితే, ఆరు నిముషాల పాటు “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడిన వర్మ, మన జక్కన్నను పొగడడానికి తికమకపడుతూ మాట్లాడడం మనం వినవచ్చు.

సహజంగా ఏ అంశం మీదైనా ప్రత్యర్థికి కౌంటర్ వేస్తూ… తన బాణీని వినిపించడంలో వర్మ స్టైల్ తెలిసిందే. కానీ “ఆర్ఆర్ఆర్” గురించి తాను ఏం చెప్పాలనుకున్నారో, ఏం చెప్పారో కూడా ఆయనకే అర్ధం కాలేదంటే, రాజమౌళి విజువల్స్ కు ఎంతలా ఫిదా అయిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ మేనియాలో వర్మ కూడా మునిగిపోయారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ఇంతకీ 6 నిముషాల వాయిస్ సందేశంలో ఎంతో కొంత అర్ధమైన విషయాలు ఏమిటంటే… ‘బాహుబలి’ లాంటి సినిమాలు చూసినపుడు తనకు ఏమీ అనిపించలేదని, కానీ ‘ఆర్ఆర్ఆర్’లో ఒక చిన్న పాపను కాపాడాలనుకునే పాయింట్ తో ప్రారంభమై, కథను తీర్చిదిద్దిన విధానం, పండించిన ఏమోషన్స్ వర్ణనాతీతంగా ఉన్నట్లుగా అభివర్ణించారు.

సెకండ్ హాఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ భుజంపై కూర్చుని రామ్ చరణ్ సాగించిన ఫైట్ సన్నివేశం గానీ, పులులను వేసుకుని ఎన్టీఆర్ పై చిత్రీకరించిన యాక్షన్ సీన్ గానీ… ఇవేమీ కూడా చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని, నిజంగా చెప్పాలంటే మొదటిసారి తనకు ఇలాంటి అనుభూతి కలుగుతోందని, ఒక చిన్న పిల్లాడిలా సినిమాను ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చారు.

అలాగే ‘ఆర్ఆర్ఆర్’లో చేసిన యాక్షన్ సీన్స్ ‘బ్యాట్ మెన్, సూపర్ మ్యాన్’ సినిమాలకు తక్కువేమీ కాదని ఇలా ఎంతో కొంత అర్ధమైంది. మిగిలిన వర్మ పరిభాష ప్రస్తుతం ఆయనక్కూడా అర్ధం కాని రీతిలో చెప్పుకొచ్చారు. తన వాక్చాతుర్యంతో అందరిని కన్ ఫ్యూజన్ లో పడేసి తన పబ్బం గడుపుకునే వర్మకే మాటలు రాకుండా చేసిన రాజమౌళి, ఈ సందర్భంగా కూడా అభినందనీయుడే!