ram-dev-baba-accident-patanjaliయోగా గురు, పతంజలి వ్యవస్థాపకులు అయిన రాందేవ్‌ బాబాపై సామాజిక మాధ్యమాల్లో ప‌లు వ‌దంతులు షికార్లు చేస్తున్నాయి. పూణే నుండి ముంబై వెళ్తుండగా, రాందేవ్ బాబా రోడ్డు ప్ర‌మాదానికి గురయ్యారని, దీంతో అక్కడికక్కడే బాబా మరణించారని, అలాగే కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులు కూడా చనిపోయారని ఫేస్‌ బుక్, వాట్స‌ప్‌ వేదికలుగా వార్త‌లు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా స్ట్రెచర్‌ మీద ఉన్న రాందేవ్ బాబాను ఆసుప‌త్రికి తరలిస్తున్నట్టు ఫోటోలు కూడా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు క‌థ‌నాల‌పై స్పందించిన స‌న్నిహితులు ఇవ‌న్నీ వ‌దంతులేన‌ని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్‌ బాబా హరిద్వార్‌లో నిక్షేపంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోష‌ల్‌ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించార‌ని, ఈ వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానంటూ రాందేవ్ బాబా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే స్ట్రెచర్‌ మీద ఉన్న రాందేవ్ బాబాను చూసినపుడే ఇవి పుకార్లని చెప్పేయవచ్చు.

భారీ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తున్నా, బాబా ముఖంపై చిన్న ఘాటు కూడా పడకపోవడం, ఈ పుకార్లను సృష్టించిన వారు ఆలోచించలేదేమో..! ఇటీవల కాలంలో అనేక సినీ సెలబ్రిటీలను సోషల్ మీడియా వేదికగా చంపేస్తున్న తరుణంలో… తాజాగా రాందేవ్ బాబా వంతు వచ్చినట్లుంది. అయితే అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో గానీ, ఏమి ఆలోచించకుండా షేర్లు చేసే వారు మాత్రం కాస్త ఆలోచించాలని కోరడం సన్నిహితుల వంతవుతోంది.