ram-charan-upasana-kamineni-at-jr-ntr-lakshmi-pranathi-wedding-anniversaryటాలీవుడ్ లో అగ్ర హీరోల మధ్య వాతావరణం మారుతోంది. ఒకప్పుడు ఒకే వేదికలపై కనిపించడం గగనం కాగా, ప్రస్తుతం వేదికలపైనే కాదు, ఓ చిన్న ఫంక్షన్ వచ్చినా, ఒకరికొకరు మమేకం అవుతూ సెలబ్రేట్ చేసుకుంటున్న రోజులివి. ఇటీవలే ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను మహేష్ – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేసిన వైనం తెలిసిందే. సినీ ప్రేక్షకులకు కన్నులవిందు చేసిన ఈ ఫోటోల సీక్వెల్స్ లో భాగంగా తాజాగా రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు కలిసి ఉన్న ఫోటో నెట్టింట హంగామా చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి పెళ్లి రోజు సందర్భంగా జరుపుకున్న ఈ వేడుకలో రామ్ చరణ్ – ఉపాసనలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ను ఉపాసన తన ఒడిలో కూర్చోపెట్టుకోగా, వెనుక ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకుని దిగిన స్టిల్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’లా మారింది. ఈ ఇద్దరు హీరోలతో రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ కు గ్రౌండ్ వర్క్ బాగా జరుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా ఈ ఇద్దరి అగ్ర హీరోల కలయిక అభిమానుల నడుమ మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు.