Ram charan Supports Pawan Kalyan Jana Sena రాబోయే సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్రను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిఖిస్తాయా? ఏమో దీనికి సమాధానం ఇప్పుడే చెప్పలేం గానీ, ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ‘జనసేన’ పేరు ఇప్పుడు మెగా కాంపౌండ్ వేదికగా మారుమ్రోగడానికి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. అవును… నాడు జనసేన స్థాపించిన నాడు మెగా బ్రదర్ నాగబాబుతో సహా రామ్ చరణ్, అల్లు అర్జున్ అండ్ కో తమ మద్దతు చిరంజీవికేనని తేల్చిచెప్పారు. రాజకీయంగా పవన్ తో విభేదించినా కుటుంబ పరంగా తామంతా ఒక్కటేనని బదులిచ్చుకున్నారు.

అయితే ఈ మాటలన్నీ అప్పుడు. ప్రస్తుతం మెగా కాంపౌండ్ స్వరం మారుతోంది. మొన్నటివరకు జనసేనతో తమకు సంబంధం లేదన్న వారే ఇప్పుడు ‘జై’ కొడుతుండడం… ఏపీ రాజకీయాలలో కలవరపెట్టే అంశం. తొలుత తన మద్దతు చిరుకే అని ప్రకటించిన నాగబాబు, ఇటీవల ఏకంగా తాను రాజకీయాల్లో పోటీ అంటూ చేస్తే అది ఒక్క జనసేన తరపున మాత్రమేనని చెప్తూ… మెగా కాంపౌండ్ స్వరాన్ని అభిమానులకు అర్ధమయ్యేలా చెప్పారు. అయితే ఇది నాగబాబు వ్యక్తిగత అభిప్రాయంగా భావించడంతో, ఈ వ్యాఖ్యలకు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు.

కానీ, తాజాగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచాయి. రాజకీయ పరంగా తన మద్దతు బాబాయ్ పవన్ కళ్యాణ్ కేనని, మెగా అభిమానులంతా కూడా ‘జనసేన’ వెంట నిలవాలని చెర్రీ పిలుపునివ్వడం అనేది మారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందా? అన్న టాక్ హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ‘జనసేన’ బాట పడతారా? అన్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు తెరలేపాయి. సినిమాల పరంగా కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పడం రెగ్యులర్ గా జరిగే విషయమే.

కానీ, రామ్ చరణ్ ప్రత్యేకించి అభిమానులంతా జనసేనకు మద్దతు ఇవ్వాలని తెలపడం అంటే, పవన్ కళ్యాణ్ వెనుక మెగా ఫ్యామిలీ అంతా కొండంత అండగా ఉందని చెప్పడమే కదా! ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపధ్యంలో… పవన్ కు మెగా ఫ్యామిలీ నుండి బహిరంగ మద్దతు లభిస్తే… మెగా అభిమానులకు అది కొత్త ఉత్తేజాన్ని ఇచ్చినట్లే చెప్పవచ్చు. అలాగే పవన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా దోహదపడే అంశమే. అయితే చిరు కూడా ఎంట్రీ ఇస్తే మాత్రం ఫలితాలు వేరుగా ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో జనసేనలోకి మెగాస్టార్ వస్తున్నారా? లేదా? అన్నది కీలకం కాబోతోంది.