రెగ్యులర్ కమర్షియల్ సినిమాల బాటను వీడి, తొలిసారిగా కాస్త కొత్తదనం కోసం ప్రయత్నించే క్రమంలో “ధృవ” సినిమా చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్ చరణ్, కమర్షియల్ గానూ మంచి ఊపులో కొనసాగుతున్నాడు. యుఎస్ బాక్సాఫీస్ వద్ద అందని ద్రాక్షగా మారిన 1 మిలియన్ డాలర్ కల సాకారం కావడంతో మంచి ఉత్సాహంలో ఉన్న చెర్రీ తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరక్కబోయే ఈ సినిమా గ్రామీణ నేపధ్యంలో సాగే కధన్న విషయం స్వయంగా సుకుమారే స్పష్టం చేసారు. అయితే కధలో కీలక పాత్ర పోషించే హీరోయిన్ ఎంపిక ప్రస్తుతం తర్జనభర్జనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా రాశి ఖన్నా పేరును పరిశీలించగా, తాజాగా సమంత అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ ఫైనల్ కాలేదని, ఇంకా హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోందని సమాచారం.
సహజంగా రామ్ చరణ్ సినిమాలకు హీరోయిన్ల ఎంపిక చాలా సులభంగా జరిగే ప్రక్రియ. అయితే సుకుమార్ మాత్రం చాలా అంశాలను పరిశీలించిన మీదటే ఓకే చెప్తారు. అయితే వీరిద్దరికీ మంచి రిలేషన్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ టాలీవుడ్ నాట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో చూడాలి. డిసెంబర్ లోనే షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నా, హీరోయిన్ ఎంపిక కారణంగా ఆలస్యమయ్యే సూచనలు కనపడుతున్నాయి.