Ram charan - Sukumar Cinema Latest Newsసినిమా షూటింగ్ ల కోసం సెట్లు వేసి కృత్రిమంగా ఎన్ని అద్భుతాలునైనా సృష్టించవచ్చు. కానీ, అవి సహజంగా ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛతను మాత్రం ఇవ్వలేవు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కూడా అలాంటి సహజమైన ప్రకృతి సౌందర్యాల నడుమే షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీకి మరపురాని షూటింగ్ లొకేషన్ ను ఎంపిక చేసుకున్నారు. మరో చిత్రమేమిటంటే… బహుశా ఈ సినిమా తర్వాత షూటింగ్ చేయడానికి అవకాశం లభించకపోవచ్చు.

మరి అంతటి అరుదైన ప్రాంతం ఎక్కడ ఉందా… అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, తెలుగుదనానికి నిలయమైన ఆంధ్రప్రదేశ్ లోనే! కృష్ణంరాజు కెరీర్ లోనే ఆల్ టైం క్లాసికల్ సినిమాగా నిలిచిపోయే ‘త్రిశూలం,’ చిరంజీవి కెరీర్ లో అవార్డు విన్నింగ్ సినిమాగా నిలిచిన ‘ఆపద్భాందవుడు,’ బాలకృష్ణకు ‘బంగారు బుల్లోడు,’ అల్లరి నరేష్ కు ‘ప్రాణం’ వంటి సినిమాలకు అద్భుతమైన లొకేషన్లతో ప్రాణం పోసిన ఆ ఊరు పేరు పూడిపల్లి. తూర్పు గోదావరి జిల్లాలో నిలయమైన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది.

దీంతో ఈ గ్రామంలో షూటింగ్ నిర్వహించాలని దర్శకుడు సుకుమార్ ఫిక్స్ అయ్యారు. గ్రామీణ వాతావరణ నేపధ్యంలో తెరకేక్కే సినిమాగా కావడంతో, ఓ సుదీర్ఘమైన షెడ్యూల్ ను ఇక్కడ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇంతటి ప్రకృతి అందాలకు నిలయమైన ఈ గ్రామంలో ఈ సినిమానే చివరి షూటింగ్ అవడానికి అవకాశాలేంటి? అంటే పోలవరం ప్రాజెక్ట్ అన్న సమాధానం లభిస్తోంది. ముంపు గ్రామాల్లో ఒకటిగా ఇప్పటికే ఖ్యాతినందుకున్న ఈ గ్రామం త్వరలోనే కనుమరగయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే సుక్కూ – చెర్రీల సినిమా షూటింగే ఆఖరిది కావచ్చని సమాచారం.