Rangasthalam-Terrific-Advances---Ram-Charan-Best-Chance-To-Better-MDమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఇప్పటివరకు తొమ్మిది తెలుగు చిత్రాలలో, ఒక డబ్బింగ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కొన్ని బాక్సాఫీస్ హిట్లు, ఫట్లు, అలాగే ఒకటి ఇండస్ట్రీ హిట్ కూడా నమోదైంది. ఇలా కమర్షియల్ గా మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విజయవంతం అయిన రామ్ చరణ్, ఒక నటుడిగా మాత్రం విమర్శకులను ఏ మాత్రం మెప్పించలేదనే చెప్పవచ్చు. గడిచిన తొమ్మిది చిత్రాలలో ‘ధృవ’ మూవీకే కాస్త ప్రశంసలు లభించాయి.

అదే చెర్రీ కెరీర్ ను టర్న్ చేసినట్లుగా కనపడుతోంది. ఇక మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానున్న “రంగస్థలం” ద్వారా రామ్ చరణ్ కు ఏం దక్కబోతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ ను పూర్తిగా నిరాశపరచగా, సమ్మర్ బొనంజాకు ‘రంగస్థలం’ తెరలేపనుంది. దీంతో కనీసం సమ్మర్ అయినా టాలీవుడ్ ను కళకళలాడిస్తుందేమోనని ఇండస్ట్రీ జనాలు కూడా ‘రంగస్థలం’ వైపు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీనికి అనుబంధంగా అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతుండడం చెప్పుకోదగ్గ పరిణామం.

మరోవైపు ఓవర్సీస్ ప్రీమియర్స్ లో కూడా చెర్రీ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునేలా కనపడుతోంది. ఇలా కమర్షియల్ యాంగిల్ లో పూర్తిగా లెక్కలు తేలాలంటే, సినిమా విడుదలై ఒక రెండు, మూడు రోజులు తేలాల్సి ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్స్ కు విరుద్ధంగా ‘రంగస్థలం’ అనే సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ‘ది బెస్ట్’గా నిలవనుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇది బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోయే చెర్రీ గురించి కాదు, అభినయం పరంగా చెవిటి వ్యక్తిగా మెగా పవర్ స్టార్ ప్రదర్శించే రంగస్థల విన్యాసం గురించి!

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన తనయుడి అభినయానికి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదని, ఒకవేళ రాకపోతే అది అన్యాయమే అవుతుందని వెలిబుచ్చడం అనేది… పుత్రోత్సహపు మాటలు అనుకున్నా, అల్లరి నరేష్ వంటి ఇతర హీరోలు కూడా ఈ సినిమాకు చెర్రీకి జాతీయ అవార్డు వస్తుందని కితాబిచ్చారంటే… బాక్సాఫీస్ ఫలితంతో నిమిత్తం లేకుండా ఈ ‘మగధీర’ తొలిసారిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోబోతున్నాడని స్పష్టమవుతోంది. అలా జరగాలని, దానితో పాటు బాక్సాఫీస్ విజయం కూడా అందుకోవాలని ఆశిద్దాం.