Jr-NTR-and-Ram-Charan RRRకొన్ని కొన్ని విశ్లేషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి ఓ విశ్లేషణే “ఆర్ఆర్ఆర్” గురించి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది సహించలేని వారో లేక ఇది మింగుడుపడని వారో తమ అభిప్రాయాన్ని ఎలా అయినా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని భావిస్తున్నట్లుగా కనపడుతోంది.

“ఆర్ఆర్ఆర్” సినిమాను ఎలా అయినా ఆడించాలని కమ్మ మరియు కాపు సామాజిక వర్గాలు ఒక్కటై, ఈ సినిమాను నిలబెట్టారని, ఈ రెండు సామాజిక వర్గాలు సినిమాలో నటించిన ఇద్దరు హీరోలకు చెందినవి కావడంతో, వీటిని తెరపైకి తీసుకువచ్చారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఒక సామాజిక వర్గమో లేక ఒక హీరో, ఇద్దరు హీరోల అభిమానులో సినిమాను హిట్ చేసి కోట్లకు కోట్లు కుమ్మరిస్తారా? ఇది సాధ్యమయ్యే విషయమేనా? కనీస అవగాహన కూడా లేకుండా ఇలాంటి వితండ వాదనలు ఎలా వినిపిస్తారో వారికైనా అర్ధమవుతుందో లేదో? ఒకవేళ ఇదే నిజమైతే ఏ సామాజిక వర్గానికి చెందిన హీరోను వాళ్ళే నెత్తిన పెట్టుకుని పూజిస్తారు గానీ, ఏ సినిమా కూడా ప్లాప్ అనే ప్రశ్నే ఉండదు.

‘కమ్మ + కాపు’ కులాల కలయిక అనేది ఇష్టం లేని వారు చేస్తున్న ప్రచారంగా దీన్ని భావించవచ్చు. ప్రస్తుతం సినిమాలు + రాజకీయాలు మిళితం అయిపోయిన నేపథ్యంలో… రాబోయే ఎన్నికలలో ఈ రెండు సామాజిక వర్గాలు ఏకం అయితే నష్టం వస్తుందని భావించే వారు, ఈ సినిమాను అడ్డం పెట్టుకుని చేస్తోన్న విష ప్రచారంగా కూడా పేర్కొనవచ్చు.

ఒకవేళ వారు చేసే వాదనే సబబని భావిస్తే… ఉత్తరాదిలో ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే 100 కోట్లు మార్క్ దాటిపోయింది. మరి అక్కడ ఉన్నది కూడా ఈ రెండు కులస్తులేనా? అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా ‘ఆర్ఆర్ఆర్’కు నీరాజనాలు పలుకుతున్న నేపధ్యంలో, ఏపీ, తెలంగాణాల నుండి వలస వెళ్లి మరీ పక్క రాష్ట్రంలో చూసి వస్తున్నారా?

అత్యంత హాస్యాస్పదంగా మారిన ఈ విశ్లేషణ విన్న వారు ఫక్కున నవ్వుకుంటున్నారు. గతంలో ‘అఖండ’ సినిమా యుఎస్ లో సూపర్ హిట్టయిన సందర్భంలో కూడా ఇలాంటి వింత వాదనే వెలుగు చూసింది. యుఎస్ లోని ఒక ఏరియాలో కమ్మ వారంతా ఈ సినిమా టికెట్లు కొని ఫ్రీగా పంచి పెడుతున్నారని పేర్కొని నవ్వుల పాలయ్యారు.

కులాల మీద కుళ్ళు భావనలు వ్యక్తం చేస్తూ ఎంత కాలం పబ్బం గడుపుకుంటారు? తరాలు మారుతున్నా, ఈ కులాల చిచ్చులో ఏ మాత్రం మార్పు రాకుండా చూసుకోవడంలో రాజకీయ నేతలు తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. ఒకప్పుడు రాజకీయ రంగానికి పరిమితం కాగా, ప్రస్తుతం మాత్రం అన్ని రంగాలలో ఈ కుల చిచ్చును విస్తరించడంతో “రాజకీయం” ప్రధాన పాత్ర పోషిస్తోంది.