ram-charan-jr-ntr-rrr-launch-breaking-coconutరాజమౌళి దర్శకత్వంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ నుండి జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన పూజా కార్యక్రమాలలోని వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తోన్న ఈ వీడియోకు నెటిజన్లు, సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు.

పూజా కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన రామ్ చరణ్, దానిని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లడం విశేషం. తండ్రి చనిపోయిన కారణంగా ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టకూడదని భావించి అలా నిల్చుండిపోగా, తన కొబ్బరికాయను ఎన్టీఆర్ తాకాల్సిందిగా కోరుతూ… తారక్ చేతులను తాకి వచ్చిన తర్వాతనే చెర్రీ కొబ్బరికాయ కొట్టడం హైలైట్ గా నిలిచింది.

సిల్వర్ స్క్రీన్ పైన ఈ ఇద్దరూ హీరోలు ఎలా చేసినా…. ఆఫ్ స్క్రీన్ లో చెర్రీ చేసిన సంఘటన అభిమానుల మనసు దోచుకుంది. ఈ మాటకు వస్తే ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు…, వీక్షించిన వారంతా చెర్రీ మనస్తత్వాన్ని ప్రశంసిస్తున్నారు. దీంతో టాలీవుడ్ అసలు సిసలు మల్టీస్టారర్ ఇదేనంటూ ఇరువురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.