ram-charan-dhruva-screen-name-young-mega-starతండ్రి (మెగాస్టార్) + బాబాయ్ (పవర్ స్టార్)ల బిరుదులను మిక్స్ చేసి ‘మెగా పవర్ స్టార్’గా ప్రేక్షకులకు సుపరిచితం అయిన రామ్ చరణ్, ఇటీవల కాలంలోనే సదరు బిరుదుకు దూరమైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ తో చిరు ఫ్యామిలీతో ఏర్పడ్డ విభేదాల కారణంగానే రామ్ చరణ్ ను ‘మెగా పవర్ స్టార్’ అని పిలవవద్దని మెగా కాంపౌండ్ నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా అప్పట్లో హల్చల్ చేసిన సంగతులు తెలిసినవే.

దీనికి మరింత బలం ఇచ్చేలా ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా నుండి చెర్రీ పేరుకు ముందు ఎలాంటి బిరుదు సిల్వర్ స్క్రీన్ పై పడడం లేదు, అలాగే ఆడియో వేడుకలలో గానీ, ఇతర సినీ వేడుకలలో చెర్రీని ఎవరూ ‘మెగా పవర్ స్టార్’ అని సంభోదించడం లేదు. అయితే త్వరలో విడుదల కాబోతున్న ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్ పేరుకు ఎలాంటి బిరుదు పడనుంది? ప్రస్తుతానికి అయితే తెలియదు గానీ, ఓ మీడియా ఛానల్ మాత్రం చెర్రీని సరికొత్త బిరుదుతో పిలవడం మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

ఓ టాప్ మీడియా ఛానల్ ప్రసారం చేసిన ఓ సినీ కార్యక్రమంలో రామ్ చరణ్ ను ‘యంగ్ మెగాస్టార్’ అంటూ కితాబిచ్చింది. అయితే దీనిపట్ల మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ‘మెగాస్టార్’ అంటే సినీవినీలాకాశంలో ఒకే ఒక్కరు అది ‘మెగాస్టార్’ చిరంజీవి తప్ప మరొకరు కాదని, ఎంత చిరుకు వారసుడు అయినా చెర్రీకి ‘మెగాస్టార్’ బిరుదు తగదన్న భావన మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కొంతవరకు వీరి వాదన కూడా సరైనదే అన్న అభిప్రాయాన్ని నెటిజన్లు అంగీకరిస్తున్నారు.

ఎన్నో రకాల పాత్రలతో ‘మెగాస్టార్’గా చిరు ఎదిగిన తీరుతో అనిర్వచనీయం. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో చెర్రీ వారసుడు అవుతాడేమో గానీ, ‘మెగాస్టార్’ బిరుదు అంటే ఒక్క కలెక్షన్స్ సంబంధించి మాత్రమే కాదు. చిరు అంటే ఎలాంటి హావభావాలనైనా అవలీలగా పలికించగల నటుడు. మరి చెర్రీ విషయంలో ఇంత ఘంటాపధంగా చెప్పగలమా? కాదు అన్న సమాధానమే వెలువడుతుంది. ఈ కారణం చేతనే ‘యంగ్ మెగాస్టార్’ పట్ల మెగా ఫ్యాన్స్ విముఖత వ్యక్తం చేస్తున్నారు.