ram-charan-about-pawan-kalyanరాజకీయ పరంగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ కు ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పవన్ సైతం చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కుటుంబ పరంగా తామంతా ఒక్కటే అని చిరంజీవి నుండి పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఒకే మాటపై ఉన్నారు, వివిధ సందర్భాలలో ఇదే భావనను వ్యక్తపరిచారు కూడా! అయితే తాజాగా “ధృవ” ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ నోటి వెంట “పవన్ కళ్యాణ్ గారు” అని సంభోదించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

తన భవిష్యత్తు సినిమాల గురించి చెప్తున్న సందర్భంలో… తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని, ప్రస్తుతం చేసిన ‘ధృవ’కు ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుందని అన్న చెర్రీ, మణిరత్నం దర్శకత్వంలో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందని చెప్పిన చెర్రీ, గత కొన్నాళ్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న పవర్ స్టార్ బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’లో సినిమాపై స్పందించారు.

“పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకునే క్రమంలో ఉన్నారు, అలాగే తన కమిట్మెంట్స్ కూడా పూర్తయిన తర్వాత ఆయన బ్యానర్ లో సినిమా ఉంటుందని” స్పష్టత ఇచ్చారు. సినిమాపై క్లారిటీ విషయాన్ని పక్కనపెడితే, ‘బాబాయ్’ అని పిలవాల్సిన చోట, ఏదో బయట వ్యక్తి మాదిరి ‘పవన్ కళ్యాణ్ గారు’ అని ప్రస్తావించడం, వినడానికి కాస్త కొత్తగా ఉంటుందేమో గానీ, ఇది ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి మరో సంకేతాలను పంపుతుందన్న విషయాన్ని చెర్రీ మరచినట్లున్నారు. దీంతో మరీ ఇంత “ప్రొఫెషనలిజం” చెర్రీకి తగదు అంటున్నారు సినీ జనాలు…!