Ram Charan Dhruva Audio Talkసురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన “ధృవ” సినిమా ఆడియో ఆన్ లైన్ ద్వారా విడుదలైంది. మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి కనపరిచిన ఈ ఆడియోలో కేవలం నాలుగు పాటలే ఉండగా, అవి కూడా తక్కువ నిడివి కలిగి ఉన్నవే కావడం గమనార్హం. మొత్తం నాలుగు పాటలు కలిపి 13 నిముషాలే ఉండగా, అందులో ఒక్క పాట కూడా వినసొంపుగా లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసే అంశం.

లిరిక్స్ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, హిప్ హాప్ అందించిన సంగీతం మాత్రం తెలుగు సంగీత ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉంది. నాలుగు పాటలు కూడా ఓ డబ్బింగ్ సినిమా పాటల మాదిరి ఉండడంతో, ఈ సినిమా ఆడియో పరంగా వండర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియో సాంగ్స్ టీజర్స్ తో విజువల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారని అర్ధమవుతోంది.

దీంతో ‘ధృవ’ పాటలను వినాలంటే కాస్త కష్టమైన విషయమేమో గానీ, వెండితెరపై మాత్రం అద్భుతంగా చూడవచ్చేమో. ఉన్న నాలుగు పాటల్లో మెలోడీగా సాగే ‘చూసా చూసా’ అనే పాటే సోసోగా ఉందని శ్రోతలు తేల్చేసారు. ముఖ్యంగా మాస్ వర్గీయులైన మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఒక్క పాట కూడా లేకపోవడం విస్తుగొలిపే విషయమే. బహుశా ఈ స్పందనను దృష్టిలో పెట్టుకునే ఆడియో వేడుక జరపలేదేమో అన్న టాక్ కూడా వినపడుతోంది. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న హిప్ హాప్ కు, ఆడియో పరంగా పెద్దగా మార్కులు పడలేదు.