Ram Charan Comments on Success and Failure in his moviesసినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా డిజాస్టర్లు చూడని హీరోలు దర్శకులు ఉండరు. రాజమౌళిని దీనికి మినహాయింపుగా చెప్తారేమో కానీ అంత సుదీర్ఘమైన కెరీర్ లో చేసింది పన్నెండు సినిమాలే కాబట్టి ఆయనను మాత్రం ప్రత్యేకమైన కేస్ గా చూడాల్సిందే. ఏదైనా ఫ్లాప్ వచ్చినప్పుడు దాన్నో పాఠంగా తీసుకోవాలి తప్పించి పదే పదే ఆ గాయాన్ని గుర్తు చేసుకోవడమంటే దానికి పని చేసిన దర్శకుడో సాంకేతిక నిపుణుడో అవసరం లేని సందర్భంలోనూ బాధ పడాల్సి వస్తుంది. ఇప్పడీ టాపిక్ రావడానికి కారణముంది. ఇవాళ ముంబైలో జరిగిన హెచ్టిఎల్ఎస్ లీడర్ షిప్ సమ్మిట్ కు అక్షయ్ కుమార్ తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ చేసిన కామెంట్లే.

ఆర్ఆర్ఆర్ తర్వాత తానో ప్రత్యేక పాత్ర చేశానని కానీ ఎవరూ పట్టించుకోలేదని దీన్ని బట్టి కంటెంట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలని నొక్కి చెప్పాడు. అది ఆచార్య గురించేనని వేరే చెప్పాలా. మొన్నామధ్య లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో చిరంజీవి సైతం ఇన్ డైరెక్ట్ గా కొరటాల శివను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. కథలు స్క్రిప్టుల ప్రాధాన్యం గురించి చెప్పడంలో తప్పు లేదు. కానీ ఫలానా ఫ్లాప్ వచ్చిందని మళ్ళీ మళ్ళీ కెలకడమే అసలు సమస్య. ఇంతకు ముందు వినయ విధేయ రామ దారుణంగా బోల్తా కొట్టినప్పుడు చరణ్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో సారీ చెప్పడం బోయపాటి శీనుకి ఇబ్బంది కలిగించడం ఇంకా గుర్తే. గని తర్వాత వరుణ్ తేజూ ఇదే చేశాడు.

ఇలా క్షమాపణలు చెప్పుకోవడం పబ్లిక్ స్టేజిల మీద గిల్టీగా ఫీలవ్వడం అభిమానుల కోణంలో గొప్పగా అనిపించవచ్చేమో కానీ ఇండస్ట్రీ పరంగా కాదు. గతంలో భాయ్ గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో నెగటివ్ గా అన్నందుకే తన కెరీర్ వెనక్కు వెళ్లిందని దర్శకుడు వీరభద్రం ఓసారి వాపోయారు. ఇవన్నీ కెరీర్లను ప్రభావితం చేసేవే. బోయపాటికి బాలయ్య, కొరటాలకు జూనియర్ అవకాశాలు ఇచ్చారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మీడియం రేంజ్ హీరోలతో సర్దుకోవాల్సి వచ్చేదిగా. చరిత్ర ఎన్నో ఫ్లాపులు ఇండస్ట్రీ హిట్లు చూసింది వాటికి ఎవరూ అతీతం కాదు. మేజర్ చంద్రకాంత్ ఘనవిజయం సాధించక ముందు సినిమాల పరంగా స్వర్గీయ ఎన్టీఆర్ తిన్న దెబ్బలు చిన్నవి కావు.

ఇవన్నీ సహజం. గెలుపుని స్ఫూర్తిగా ఓటమిని పాఠంగా నేర్చుకుంటే తప్ప ముందుకు సాగలేం. మృగరాజు, ఒక్క మగాడు, బ్రూస్ లీ, శక్తి, బాబీ, ఏక్ నిరంజన్, వరుడు, షాడో ఇలా ఏ హీరోను ఉదాహరణగా తీసుకున్నా ఇలాంటి కళాఖండాలు బోలెడు కనిపిస్తాయి. వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తే ఆ సినిమాలకు పని చేసిన వాళ్ళు అన్న మాటలకు నవ్వురాక మానదు. కానీ వీలైనంత వరకు అవన్నీ మర్చిపోయి కంబ్యాక్ అనే సూత్రంతో పని చేసుకుంటూ వెళతాం కాబట్టే బండి మళ్ళీ పట్టాలు ఎక్కుతోంది. చరణ్ అన్నది పూర్తిగా తప్పని కాదు ఇక్కడి ఉద్దేశం. కంటెంట్ గొప్పదని చెప్పాల్సి వస్తే అదేదో ప్యాన్ ఇండియా రేంజ్ లో అదరగొడుతున్న సౌత్ సినిమాల గురించి చెప్తే పోయడానికి ఆచార్యని గుర్తు చేసుకోవడం ఎందుకు అధ్యక్షా.